
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా సాగుతుంది. రేస్ లో 7 జట్లు ఉన్నప్పటికీ పోటీ అంతటా 6 జట్ల మధ్యే కొనసాగుతుంది. బుధవారం (మే 7) ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోవడంతో రహానే సేన దాదాపుగా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంది. కోల్‌కతా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిచినా 15 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. గురువారం (మే 8) పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే 17 పాయింట్లతో ఎలాంటి సమీకరణలు లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ లో ముందుంటుంది. ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక పంజాబ్, ముంబై జట్ల మధ్య కూడా మ్యాచ్ ఉంది. ఈ మూడు మ్యాచ్ ల ఫలితాలు ప్లే ఆఫ్స్ స్థానాలను డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్ 16 పాయింట్లతో దాదాపు ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. పంజాబ్(15), ఢిల్లీ(13), ముంబై(14) జట్ల మధ్య ప్లే ఆఫ్స్ రేస్ ఉత్కంఠ భరితంగా మారింది.
పంజాబ్ కు మరో మూడు మ్యాచ్ లు ఉన్న నేపథ్యంలో ఆ జట్టు ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఢిల్లీ, ముంబై జట్లు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. లక్నో సూపర్ జయింట్స్(10) కు అవకాశమున్నా.. ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ లు గెలవడంతో పాటు మిగిలిన మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. కోల్‌కతా ఓటమితో ఆర్సీబీ, గుజరాత్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాయి. పంజాబ్, ముంబై, ఢిల్లీ జట్లలో రెండు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నై, రాజస్థాన్, సన్ రైజర్స్ జట్లు అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.