సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు ఫుల్ క్రేజ్

సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు  ఫుల్ క్రేజ్

ఉప్పల్, వెలుగు:  నాలుగేండ్ల తర్వాత సిటీలో తొలి ఐపీఎల్ ​మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ మ్యాచ్​కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కరోనా ఎఫెక్ట్​తో చివరి మూడు ఐపీఎల్ సీజన్ల మ్యాచ్​లు ముంబయి, దుబాయ్​లో జరగడంతో హైదరాబాదీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ 16వ సీజన్​లో పలు తేదీల్లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచ్​లు జరుగుతుండటం కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. సన్ రైజర్స్ మ్యాచ్​ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇవ్వాళ రాజస్థాన్ రాయల్స్​తో జరగనున్న పోటీ జోష్​ను నింపనుంది.

1500 మంది పోలీసులతో బందోబస్తు

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరగనున్న సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మే 18 వరకు మొత్తం 7 మ్యాచ్​లు జరగనుండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా అన్నీ సజావుగా సాగేలా చర్యలు చేపట్టామన్నారు. శనివారం ఉప్పల్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవ్వాల్టి మ్యాచ్​కు 1500 మంది పోలీసులతో బందోబస్తు  ఉంటుందన్నారు. స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్​ను చూసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్టేడియం గేట్ నం.1 నుంచి ప్లేయర్స్​ను మాత్రమే అనుమతిస్తామని.. ఇతరులు వచ్చేందుకు వీలులేదన్నారు. స్టేడియంలో, చుట్టుపక్కల, పార్కింగ్ ప్లేసుల్లో మొత్తం 340 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిని జాయింట్ కమాండ్  కంట్రోల్ రూమ్​కు అటాచ్ చేసినట్లు సీపీ తెలిపారు. తనిఖీలను ఐటీ ఇన్ స్పెక్టర్ బృందాలు పర్యవేక్షిస్తాయని ఆయన చెప్పారు. ఈవ్ టీజింగ్ ను అడ్డుకునేందుకు స్పెషల్ షీ టీమ్స్, యాంటీ ఈవ్ టీజింగ్ టీమ్స్​ను  ఏర్పాటు చేశామన్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్​లు జరిగే రోజుల్లో ఫుట్ పాత్​లపై స్ట్రీట్ వెండర్స్ కు అనుమతి ఉండదన్నారు. 


ఇవ్వాల్టి మ్యాచ్​కు వచ్చే ప్రేక్షకులను  మధ్యాహ్నం 2 గంటల నుంచి టికెట్లపై ఉన్న క్యూ ఆర్ కోడ్ ఆధారంగా స్టేడియం లోపలికి పంపుతామన్నారు. ఒక్కసారి లోపలికి వెళ్తే మ్యాచ్ పూర్తయ్యే వరకు బయటికి అనుమతించబోమన్నారు. ప్రేక్షకులు ఈజీగా స్టేడియానికి చేరుకునేలా హబ్సిగూడ నుంచి ఉప్పల్, ఎల్​బీనగర్ వరకు అన్ని మెయిన్ సర్కిళ్ల వద్ద, ఎల్​బీనగర్ నుంచి ఉప్పల్, మేడిపల్లి నుంచి ఉప్పల్, రామంతాపూర్ నుంచి స్టేడియం వరకు దాదాపు 340 సైన్ బోర్డులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. బ్లాక్ టికెట్లను కంట్రోల్ చేసేందుకు స్పెషల్ టీమ్స్​ ఉన్నాయన్నారు.  వాటర్ బాటిళ్లు, ల్యాప్ టాప్​లు, బ్యానర్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లైటర్లు, మెటల్, ప్లాస్టిక్ ఐటమ్స్, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పర్ఫ్యూమ్స్, బ్యాగ్​లు, ఫుడ్ ఐటమ్స్​ను స్టేడియం లోపలికి అనుమతించమన్నారు.

భారీ వెహికల్స్​కు మాత్రమే ట్రాఫిక్ డైవర్షన్

ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10.30 గంటలకు వరకు భారీ వెహికల్స్​కు ఉప్పల్ స్టేడియం రూట్​లో అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్​బీ​నగర్​ నుంచి నాగోల్​ వైపు, నాగోల్​ నుంచి ఎల్​బీనగర్​  వెళ్లే వెహికల్స్​ను  బోడుప్పల్, చెంగిచర్ల క్రాస్ రోడ్ మీదుగా పంపిస్తామన్నారు. వరంగల్ నుంచి సిటీకి వచ్చే వెహికల్స్, సిటీ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాటిని చెంగిచర్ల వద్ద డైవర్ట్ చేసి చర్లపల్లి, ఐవోసీఎల్, ఎన్ఎఫ్​సీ మీదుగా మళ్లిస్తామని చెప్పారు. సాధారణ ట్రాఫిక్​కు ఎలాంటి డైవర్షన్ లేదని పోలీసులు తెలిపారు. అయితే, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి తార్నాక, హబ్సిగూడ వైపు వెళ్లే వారు జెన్ ప్యాక్ట్ రూట్​లో కాకుండా హబ్సిగూడ స్ట్రీట్ నం.8 మీదుగా వెళ్లేలా ప్రయత్నించాలన్నారు. దీని వల్ల ట్రాఫిక్ జామ్ సమస్య ఉండదన్నారు.

18 చోట్ల పార్కింగ్ పాయింట్లు 

9 వేల వెహికల్స్ పార్కింగ్ చేసేలా 18  చోట్ల పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని.. టికెట్లపై ముందుగా సూచించిన ప్రాంతాల్లోనే ప్రేక్షకులు వారి వెహికల్స్​ను పార్క్ చేయాలని సీపీ చౌహాన్ తెలిపారు. సికింద్రాబాద్, తార్నాక వైపు నుంచి వచ్చే వెహికల్స్​కు ఎన్​జీఆర్ఐ, టీఎస్ ఐలా వద్ద, అంబర్​పేట, రామంతాపూర్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్ బీనగర్ నుంచి వచ్చే వెహికల్స్ కు మాడ్రన్ బేకరీ, కేవీ స్కూల్, చర్చ్ కాలనీ ఏరియాల్లో 8 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. వెహికల్స్​ పార్క్ చేసిన వారు.. మెట్రో, బస్సులో వచ్చే వారు ఏక్ మినార్ మజీద్, ఎల్​జీ గోడౌన్ రోడ్, హిందూ పేపర్ ఆఫీసు మీదుగా స్టేడియానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. జెన్ ప్యాక్ట్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి విశాల్ మార్ట్, రామంతాపూర్ వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా వెహికల్స్ పార్కింగ్​కు అనుమతి లేదని సీపీ తెలిపారు.

ఆర్థరాత్రి 1 గంట వరకు మెట్రో..60 అదనపు బస్సులు 

ఆదివారం జరిగే ఐపీఎల్ మ్యాచ్​కు వచ్చే ప్రేక్షకుల కోసం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రోరైళ్లు అందుబాటులో ఉంటాయని సీపీ చౌహాన్ తెలిపారు.  మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇరువైపులా రైళ్లు ఒకేసారి కాకుండా కొంత గ్యాప్​తో  వచ్చేలా చూడాలని  మెట్రో రైల్ అధికారులను కోరామని, దీనివల్ల ట్రాఫిక్​ సమస్య ఉండదని ఆయన చెప్పారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులు మెట్రో రైల్, సిటీ బస్సు సర్వీసులను వాడుకోవాలని ఆయన సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ప్యాసింజర్ల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మెట్రో రైళ్లను మరింత ఫ్రీక్వెన్సీతో నడుపుతామని హెచ్‌‌‌‌ఎంఆర్‌‌‌‌ఎల్ ఎండీ ఎన్వీఎస్​రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి రెగ్యులర్​గా నడిచే బస్సులు కాకుండా అదనంగా 60 సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు 
ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి  8.30 వరకు ఉంటాయన్నారు.