IPL: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై హైదరాబాద్ విక్టరీ

IPL: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై హైదరాబాద్ విక్టరీ

సొంతగడ్డపై సత్తాచాటింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఐపీఎల్ లో భాగంగా…హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై పై ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో డిఫెండింగ్ చాంపియన్ ను 132 పరుగులకే కట్టడిచేసిన హైదరాబాద్…ఆల్ రౌండ్ ప్రతిభతో 16.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది.

ఓపెనర్లు వార్నర్ 50, బెయిర్ స్టో 61 పరుగులతో చెన్నై ను బెంబేలెత్తించారు.  బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  జట్టు స్కోరు 66 పరుగుల దగ్గర భారీ షాట్ కు ప్రయత్నించిన వార్నర్ మిడాఫ్ లో డుప్లెసిస్ చేతికి చిక్కడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన ప్లేయర్లు నిరాశపరిచినా…బెయిర్ స్టో తన దూకుడును కొనసాగించడంతో సన్ రైజర్స్ కు విజయం దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టుకు ఓపెనర్లు..డుప్లెసిస్ 45, వాట్సన్ 31 మంచి ఆరంభాన్నిచ్చారు. మొదట తడబడ్డా తర్వాత క్రీజులో కుదురుకుని బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఓ దశలో మొదటి పవర్ ప్లే ముగిసేవరకు వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది చెన్నై టీమ్. అయితే తర్వాత ఓపెనర్లు వెంటవెంటనే వెనుదిరగడంతో కష్టాల్లో పడింది సీఎస్కే. రైనా, రాయుడు ఆదుకునేందుకు ప్రయత్నించినా…రైజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.