ఐరన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ అడ్డుపెట్టి.. ఏటీఎంలలో చోరీలు..అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న వరంగల్‌‌‌‌ పోలీసులు

ఐరన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ అడ్డుపెట్టి.. ఏటీఎంలలో చోరీలు..అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న వరంగల్‌‌‌‌ పోలీసులు
  • ఏడు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు చేసినట్లు గుర్తింపు

వరంగల్‍, వెలుగు : ఓ కంపెనీకి చెందిన ఏటీఎం మెషీన్లలోని లోపాలను ఆసరాగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ జోన్‌‌‌‌ డీసీపీ దార కవిత ఆదివారం వెల్లడించారు. రాజస్తాన్‌‌‌‌ రాష్ట్రం అల్వార్‍ జిల్లాలోని మోరేడా, ఖారెడా, బీజ్వాడ నారోక, మహావకార్డ్‌‌‌‌ గ్రామాలకు చెందిన ఆరిఫ్‌‌‌‌ఖాన్‌‌‌‌, సర్పరాజ్‌‌‌‌, ఎం.ఆశ్‌‌‌‌మహ్మద్‌‌‌‌, షాపుస్‌‌‌‌ఖాన్‌‌‌‌, షారుఖ్‌‌‌‌ఖాన్‌‌‌‌, అస్లాం ఖాన్‌‌‌‌, ఎం.షారుఖాన్‌‌‌‌ మద్యం, జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం ఏటీఎం చోరీలకు ప్లాన్‌‌‌‌ చేశారు. 

ఇందులో భాగంగా ఓ కంపెనీకి చెందిన ఏటీఎం మెషీన్లలో క్యాష్‌‌‌‌ విత్‌‌‌‌డ్రా ప్లేస్‌‌‌‌లో ఉండే లాక్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేయడం ఈజీ అని గుర్తించి.. దానికి నకిలీ కీస్‌‌‌‌ తయారు చేయించారు. తర్వాత సదరు కంపెనీ ఏటీఎం మెషీన్లు ఉన్న సెంటర్‌‌‌‌కు వెళ్లి.. దానిని ఓపెన్‌‌‌‌ చేసి క్యాష్‌‌‌‌ బయటకు వచ్చే ప్లేస్‌‌‌‌ వద్ద ఓ ఐరన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ను అడ్డు పెట్టేవారు. దీంతో ఖాతాదారులు వచ్చి డబ్బు డ్రా చేస్తే.. విత్‌‌‌‌డ్రా అయినట్లు చూపించినా.. నోట్లు బయటకు వచ్చేవి కావు. ఖాతాదారులు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. నిందితులు వచ్చి ప్లేట్‌‌‌‌ను తొలగించి ఆ డబ్బులను కాజేసేవారు. 

సదరు కంపెనీ ఏటీఎం మెషీన్లపై వరుస ఫిర్యాదులు అందడంతో రాజస్తాన్‌‌‌‌లోని బ్యాంక్‌‌‌‌ ఆఫీసర్లు ఆ కంపెనీ ఏటీఎంలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దీంతో నిందితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అదే కంపెనీ ఏటీఎంలను టార్గెట్‌‌‌‌గా చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్‌‌‌‌లో వరంగల్‌‌‌‌కు చేరుకున్న నిందితులు సుబేదారి పీఎస్‌‌‌‌ పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, వరంగల్‍ మిల్స్‌‌‌‌ కాలనీ పీఎస్‌‌‌‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఏడు చోరీలకు పాల్పడి రూ.12.10 లక్షలు కాజేశారు.

 ఈ చోరీల విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో క్రైమ్స్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‍రెడ్డి టీమ్స్‌‌‌‌ రంగంలోకి దిగాయి. ఒకే కంపెనీకి చెందిన ఏటీఎం మెషీన్లలోనే చోరీలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు టెక్నాలజీ ఆధారంగా ఫోకస్‌‌‌‌ పెట్టారు. ఈ క్రమంలో కాజీపేట ఏరియాలోని ఓ ఏటీఎం వద్దకు వచ్చిన ముఠా సభ్యులు.. ఐరన్‌‌‌‌ ప్లేట్‌‌‌‌ అతికించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులకు అభినందించారు.