- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : దేశ సంపదను, ఆరావళి పర్వతాల ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సీపీఐ శత జయంతి ముగింపు వేడుకలను ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రావి నారాయణరెడ్డి భవనం నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి కూనంనేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోదీ ప్రధాని అయ్యాక దేశంలో పేదరికం, నిరుద్యోగం రెట్టింపు అయ్యాయని విమర్శించారు. దేశభక్తి ముసుగులో సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఆరావళి పర్వతాలను ఆదానీ కంపెనీకి కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.
సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు మోటపలుకుల రమేశ్, జిల్లా సహాయ కార్యదర్శులు గురుజపెల్లి సుధాకర్‌రెడ్డి, పైండ్ల శాంతి కుమార్, పట్టణ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, జిల్లా సమితి సభ్యులు రాజ్‌సతీశ్, సుగుణ పాల్గొన్నారు.
