- బెస్తం చెరువు వద్ద తమ భూములున్నాయన్న ఏఏఐ
- 40 ఏండ్లుగా ఈ భూములకు ప్రహరీ లేక., ఎవరూరాక కబ్జా
- వందలాదిగా వెలిసిన ఇండ్లు, గుడిసెలు, ఇతర నిర్మాణాలు
- ప్రస్తుతం సర్వే చేసి హద్దులు చూపాలని ఏఏఐ రెక్వెస్ట్
- ఎయిర్‍పోర్ట్ పునర్నిర్మాణంతో సంబంధంలేదన్న ఆఫీసర్లు
వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్‍పోర్ట్ భూములను ఏండ్లతరబడి చుట్టూ ఉన్న వ్యక్తులు, అక్రమార్కులు కబ్జా చేయగా, ఇటువైపు చూడని ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. దాదాపు 40 ఏండ్ల కింద మామునూర్ ఎయిర్‍పోర్ట్ సేవలు ఆపేశారు.
అప్పట్లోనే వారి భూముల చుట్టూరా ఫెన్సింగ్ పెట్టుకున్నారు. కాగా, తిమ్మాపూర్ శివారులోని ఓ సర్వే నంబర్‍లో ఏఏఐ అధికారులు తమదిగా చెప్తున్న భూములకు మాత్రం ప్రహరీ నిర్మించలేదు. దీంతో ఏండ్ల తరబడి ఓవైపు అక్రమార్కులు, మరోవైపు పేదలు ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు.
ఆందోళనలో కాలనీవాసులు
రాష్ట్ర ప్రభుత్వం మామునూర్ ఎయిర్‍పోర్టును పున:ప్రారంభించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఏడాదిలో భూసేకరణ పూర్తిచేసి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. త్వరలోనే ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు భూముల బదాలాయింపు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా, ఈ భూముల పరిశీలనకు వచ్చిన ఏఏఐ అధికారులు పనిలోపనిగా గతంలో తమకు చెందిన 9 ఎకరాల భూములు కబ్జా అయిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఏఏఐ అధికారులు తమదని చెబుతున్న ఆ ప్రాంతం ప్రస్తుతం వరంగల్_ఖమ్మం రోడ్డులో నాయుడు పెట్రోల్ పంప్ దాటాక తిమ్మాపూర్ వెళ్లే దారిలో ఉండే బెస్తం చెరువు సమీప కాలనీలుగా ఉంది. గడిచిన 40 ఏండ్లలో ఇక్కడి ప్లాట్లు ఎందరి చేతులో మారాయి. కొనుగోలు చేసినవారు ఇండ్ల నిర్మాణాలు చేసుకుని ఉంటున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు గుడిసెలు వేశాయి. అయితే మామునూర్ ఎయిర్‍పోర్ట్ పనుల కోసం వచ్చిన ఏఏఐ అధికారులు ఈ కాలనీల వైపు వెళ్లడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
ఎయిర్‍పోర్టుపై తప్పుడు ప్రచారం చేయొద్దు
ఓరుగల్లు అభివృద్ధికి అడుగులు వేసే మామునూర్ ఎయిర్‍పోర్ట్ నిర్మాణ పనులకు అడుగు దూరంలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ కృషి, రైతులు, భూయజమానుల సహకారంతో ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అడిగిన దాదాపు 253 ఎకరాలను ఏడాదిలో సేకరించాం. త్వరలోనే ఏఏఐ అధికారులకు భూములు అప్పగించడం ద్వారా ప్రభుత్వం జిల్లావాసుల కలను నెరవేర్చనున్నది.
ఈ క్రమంలో జిల్లాకొచ్చిన అధికారులు బెస్తంచెరువు వద్ద సైతం ఏఏఐకి భూములున్నాయని చెప్పారు. వారి రికార్డుల ఆధారంగా ఆ భూముల వ్యవహారం ఉంటుంది. మామునూర్ ఎయిర్‍పోర్ట్ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూములతో ఇది సంబంధంలేని అంశం. ఓరుగల్లు అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దు. - సత్యశారద, వరంగల్ కలెక్టర్
