తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని, ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు మేడారం చేరుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్లను దర్శించుకొని ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం మేడారం అటవీ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు చేశారు. ఓ వైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండడం, మరో వైపు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
