బ్రావో.. రెండు వారాలు దూరం!

బ్రావో.. రెండు వారాలు దూరం!

అబుదాబి: ఐపీఎల్‌‌–13 మొదలైనప్పట్నించి చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ను ఏదో సమస్య వెంటాడుతూనే ఉన్నది. స్టార్టింగ్‌‌లో రైనా, హర్భజన్‌‌ టోర్నీ నుంచి తప్పుకోగా, మధ్యలో రాయుడు ఫిట్‌‌నెస్‌‌ సమస్యలతో కొన్ని మ్యాచ్‌‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. వీటన్నింటిని అధిగమించి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తరుణంలో మళ్లీ దెబ్బ పడింది.  గ్రోయిన్‌‌ ఇంజ్యూరీతో డెత్‌‌ ఓవర్స్‌‌ స్పెషలిస్ట్‌‌ డ్వేన్‌‌ బ్రావో రెండు వారాలు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌లో ఆఖరి ఓవర్‌‌ వేయడానికి కూడా ఇబ్బందిపడిన బ్రావోకు రెస్ట్‌‌ అవసరమని హెడ్‌‌ కోచ్‌‌ స్టీఫెన్‌‌ ఫ్లెమింగ్‌‌ వెల్లడించాడు. దీంతో సోమవారం రాజస్తాన్‌‌తో జరిగే మ్యాచ్‌‌లో బ్రావో లేకుండా ఆడేందుకు చెన్నై సిద్ధమవుతున్నది. అయితే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌‌లో చెన్నై కచ్చితంగా గెలిచి తీరాలి.

ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌‌ల్లో ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న సీఎస్‌‌కే .. నాకౌట్‌‌ రేస్‌‌లో ముందుకెళ్లాలంటే మరింత శ్రమించాల్సిందే. బ్యాటింగ్‌‌లో పెద్దగా ఇబ్బందుల్లేకపోయినా.. బౌలింగ్‌‌లో అంచనాలు తప్పుతున్నాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌‌లో లాస్ట్‌‌ ఓవర్‌‌లో 17 రన్స్‌‌ కాపాడుకోలేకపోయింది. దీపక్‌‌ చహర్‌‌, కరన్‌‌, శార్దూల్‌‌ స్ట్రయిక్‌‌ వికెట్లు తీయడంలో విఫమవుతున్నారు. దీంతో పాటు స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో రన్స్‌‌నూ కట్టడి చేయలేకపోతున్నారు. ఫీల్డింగ్‌‌లోనూ చెన్నై వరుస తప్పిదాలు చేస్తుండటం ప్రతికూలాంశం. మరోవైపు రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ పరిస్థితి కూడా చెన్నై మాదిరిగానే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌‌పై ఆ టీమ్‌‌ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌ ఫామ్‌‌లోకి రావడం శుభసూచకం. అయితే కీలక ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఊతప్ప, బట్లర్‌‌, శాంసన్‌‌, తెవాటియా చెలరేగాల్సి ఉంది. బౌలింగ్‌‌లో స్టార్‌‌ పేసర్‌‌ ఆర్చర్‌‌ బృందం అటాక్‌‌ ఆర్డినరిగా మారిపోయింది. ప్రతి టీమ్‌‌ అతని బౌలింగ్‌‌ను సులువుగా ఎదుర్కొంటున్నది. మిడిల్‌‌ ఓవర్స్‌‌లో స్పిన్నర్లు గోపాల్‌‌, తెవాటియా రన్స్‌‌ నిరోధించలేకపోతున్నారు. ఓవరాల్‌‌గా ఈ మ్యాచ్‌‌ గెలవడం ఇద్దరికీ అత్యంత అవసరం కాబట్టి గట్టిపోటీ తప్పకపోవచ్చు.