- ఈ మార్గం అందుబాటులో ఉంటుంది
- అన్ని రకాల వాణిజ్య నౌకలకు అనుమతి
- ఇరాన్ మెరైన్ ఆర్గనైజేషన్ సూచించిన
- నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించాలని కండిషన్
- ఇరాన్‌కు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కృతజ్ఞతలు
- నేవీ బ్లాకేడ్ మాత్రం అమల్లోనే ఉంటుందని మెలిక
- 10 శాతం తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిచి ఉంచుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ - –హెజ్బుల్లా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగిసే వరకు ఈ మార్గం అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని రకాల వాణిజ్య నౌకలకు ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే, నౌకలు ఇరాన్ మెరైన్ ఆర్గనైజేషన్ సూచించిన నిర్దేశిత మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుందని కండిషన్ పెట్టారు. అమెరికా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. గత కొంతకాలంగా ఈ మార్గంలో ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. తాజా ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు స్థిరపడే అవకాశం ఉంది.
ఇరాన్‌కు ట్రంప్ ధన్యవాదాలు
హార్మూజ్‌ను తెరుస్తున్నట్టు ఇరాన్ చేసిన ప్రకటనపై ట్రంప్ స్పందించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘హార్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ధన్యవాదాలు!’’ అని పేర్కొన్నారు. అయితే, దీనిపై వెంటనే మరో స్పష్టత ఇచ్చారు. ‘‘హార్మూజ్ జలసంధి వ్యాపారాలకు సిద్ధంగా ఉంది, కానీ ఇరాన్ ఓడరేవుల నుంచి జరిగే షిప్పింగ్‌పై అమెరికా విధించిన నేవీ దిగ్బంధం మాత్రం కొనసాగుతుంది. ఇరాన్‌తో మా లావాదేవీలు 100% పూర్తయ్యే వరకు ఇది అమల్లో ఉంటుంది” అని ప్రకటించారు.
డీల్ కుదిరితే పాకిస్తాన్ పోత: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ లో డీల్ కుదిరితే తాను పాకిస్తాన్ కు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గురువారం వైట్ హౌస్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయని, త్వరలో ఆశించిన మార్పు వస్తుందన్నారు. ‘‘డీల్ ఓకే అయితే, నేను పాక్ కు వెళ్తా. డీల్ కుదిరాక నేను వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా.
మనకు ఆయిల్‌తో పాటు హార్మూజ్ జలసంధి కూడా ఫ్రీగా వస్తుంది. అలాగే, పెరిగిన ఇంధన ధరలు కూడా దిగివస్తాయి. ప్రస్తుతానికైతే ఇంధన ధరలు పెద్దగా పెరగలేదు. అలాగే గత 3, 4 రోజుల్లో గ్యాస్ ధరలూ దిగివచ్చాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా.. లెబనాన్ పై మరిన్ని దాడులు చేయకుండా ఇజ్రాయెల్ ను అడ్డుకున్నామని ట్రంప్ చెప్పారు.

