ఆ హామీ ఇస్తే యుద్ధం విరమిస్తం: ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ వెల్లడి

ఆ హామీ ఇస్తే యుద్ధం విరమిస్తం: ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ వెల్లడి
  • భవిష్యత్తులో దాడులు చేయబోమనే హామీకి డిమాండ్​
  • యురోపియన్ కౌన్సిల్ చీఫ్​తో ఫోన్ సంభాషణలో కామెంట్

టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాతో నెలకొన్న భీకర యుద్ధానికి స్వస్తి పలకడానికి తమకు ‘‘గట్టి సంకల్పం’’ ఉందని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. అయితే, యుద్ధం ముగియాలంటే తమకు కొన్ని కచ్చితమైన హామీలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఇరాన్‌‌పై మళ్లీ ఎలాంటి దాడులు జరగవనే గ్యారెంటీ ఇస్తేనే తాము వెనక్కి తగ్గుతామని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో జరిపిన ఫోన్ సంభాషణలో పెజెష్కియాన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘ఈ ఘర్షణను ముగించే ఉద్దేశం మాకు ఉంది, కానీ మా ప్రజల భద్రత మరియు ప్రయోజనాలకు భరోసా ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. దాడులు పునరావృతం కాకుండా గట్టి హామీ లభిస్తే ఉద్రిక్తతలను తగ్గించడానికి సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు సిగ్నల్ ఇచ్చారు. అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ తన పట్టును సడలించకుండానే శాంతి మంత్రాన్ని జపిస్తోంది.

ట్రంప్ ఏమంటున్నారంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగింపు దశకు వచ్చిందని సంకేతాలిస్తున్నారు. ఇరాన్ యుద్ధం విషయంలో ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఇంకా మూతపడి ఉన్నప్పటికీ, ఇరాన్‌‌పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధమేనని ట్రంప్ తన సహాయకులకు స్పష్టం చేశారు. జలసంధిని తెరిపించే ప్రక్రియను వాయిదా వేసి, యుద్ధాన్ని తన డెడ్ లైన్ లోపు ముగించాలని ఆయన భావిస్తున్నారు.

4 నుండి 6 వారాల గడువు.. నేడే 30వ రోజు!

యుద్ధం ప్రారంభమైనప్పుడే ట్రంప్ మరియు పెంటగాన్ వర్గాలు ఈ సైనిక చర్య 4 నుండి 6 వారాల పాటు మాత్రమే కొనసాగుతుందని అంచనా వేశాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ, "ఈ రోజుకు యుద్ధం మొదలై సరిగ్గా 30 రోజులు పూర్తయ్యాయి" అని గుర్తు చేశారు. జలసంధిని బలవంతంగా తెరిపించాలంటే యుద్ధం మరో కొన్ని నెలల పాటు సాగే ప్రమాదం ఉందని, అది తన టైమ్‌‌లైన్‌‌కు విరుద్ధమని ట్రంప్ అంచనా వేస్తున్నారు.

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇది పూర్తిస్థాయి దండయాత్ర కాకపోవచ్చని సమాచారం. కేవలం ఆ దేశంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మెరుపు దాడులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.