- వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం
- తదుపరి వారసుడిని చంపేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ నేపథ్యంలో అలర్ట్
టెహ్రాన్: ఇజ్రాయెల్–అమెరికా జాయింట్ ఆపరేషన్‌లో కన్నుమూసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఖమేనీ తదుపరి వారసుడిని కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలతో ఇరాన్ అలర్ట్ అయింది. గత శనివారం జరిగిన వైమానిక దాడుల్లో 86 ఏండ్ల ఖమేనీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
బుధవారం సాయంత్రం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మసీదులో ఖమేనీ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, అనూహ్య సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం, మరోవైపు దాడులు కొనసాగుతుండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ‘ఫార్స్’ ద్వారా ప్రకటించింది. అంతిమ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటన చేస్తామని పేర్కొన్నది.
ఇజ్రాయెల్ వార్నింగ్
ఇరాన్ తదుపరి నాయకుడిగా ఎవరు వచ్చినా.. వారు తమ విధ్వంసానికి లేదా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తే, వారిని కచ్చితంగా టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘వారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం, హతమారుస్తాం” అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశంలో భారీగా జనం గుమిగూడకుండా ఇరాన్ అప్రమత్తమైంది. ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేసేందుకు ఇది ఓ కారణమని తెలుస్తోంది.
ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేశారు. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తి సుప్రీం లీడర్‌గా వస్తే.. అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోక తప్పదన్నారు. కాగా, మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ విదేశాంగ విధానం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
