అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధం ముదురుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ అమెరికా ప్రజలను ఉద్దేశించి రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యం సాగిస్తున్న దురాక్రమణను ఎండగడుతూనే, సాధారణ అమెరికన్లపై తమకు ఎలాంటి శతృత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు ఈ లేఖలో ఆయన ఏఏ విషయాలను ప్రస్తావించారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇరాన్ ప్రజలకు అమెరికా, యూరప్ లేదా పొరుగు దేశాల ప్రజలపై ఎలాంటి ద్వేషం లేదని పెజెస్కియాన్ తన లేఖలో పేర్కొన్నారు. చరిత్ర పొడవునా విదేశీ జోక్యం, ఒత్తిడి ఎదురైనప్పటికీ.. ఇరాన్ ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వాలకు, అక్కడి ప్రజలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తిస్తారని పేర్కొన్నారు. ఇరాన్‌ను ప్రపంచానికి ఒక ముప్పుగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలకు పూర్తి విరుద్ధమని, అమెరికా ఏర్పడిన నాటి నుంచి ఇరాన్ ఒక్క యుద్ధాన్ని కూడా ప్రారంభించలేదని గుర్తు చేశారు.
యుద్ధం అనేది కేవలం శక్తివంతుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే పుడుతుందని లేఖలో పేర్కొన్నారు. సైనిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి.. ఆయుధ పరిశ్రమలను పోషించుకోవడానికి, వ్యూహాత్మక మార్కెట్లను నియంత్రించడానికి ఒక శత్రువు అవసరమని.. ఒకవేళ అలాంటి ముప్పు లేకపోతే, అమెరికా దానిని సృష్టిస్తుందని ఆయన విమర్శించారు. ఇరాన్ చేపడుతున్న చర్యలు కేవలం ఆత్మరక్షణ కోసం చేస్తున్న ప్రతిఘటన మాత్రమే తప్ప.. యుద్ధాన్ని ప్రారంభించడం కాదని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మగా అమెరికా?
అమెరికా తన ప్రయోజనాల కోసం కాకుండా.. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే ఈ యుద్ధంలోకి దిగిందని పెజెస్కియాన్ ఆరోపించారు. పాలస్తీనాపై తాను చేస్తున్న నేరాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికే ఇజ్రాయెల్.. ఇరాన్ తో ముప్పు ఉందనే అబద్ధాన్ని ప్రపంచ మంతటా ప్రచారం చేస్తోందన్నారు. చివరి అమెరికన్ సైనికుడి వరకు, చివరి అమెరికన్ పన్ను డాలర్ వరకు ఇరాన్‌తో పోరాడాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇది అమెరికా ప్రజల ప్రయోజనాలకు ఎలా మేలు చేస్తుందో ఆలోచించాలని సూచించారు.
1953లో ఇరాన్ వనరుల జాతీయీకరణను అడ్డుకోవడం నుంచి.. సద్దాం హుస్సేన్‌కు సపోర్ట్ ఇవ్వడం వరకు అమెరికా చేసిన పనుల వల్ల ఇరాన్ ప్రజల్లో తీవ్ర అపనమ్మకం ఏర్పడిందని ఆయన వివరించారు. క్యాన్సర్ ఆసుపత్రులపై బాంబులు వేయడం.. ఒక దేశాన్ని రాతియుగానికి పంపుతామని ప్రగల్భాలు పలకడం వల్ల అమెరికా ప్రతిష్ట దిగజారుతుందే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని హెచ్చరించారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఇరాన్ ఎందరో దురాక్రమణదారులను చూసిందని, వారు కాలగర్భంలో కలిసిపోయినా ఇరాన్ మాత్రం గర్వంగా నిలబడే ఉంటుందంటూ లేఖను ముగించారు. అమెరికా ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా వాస్తవాలను గ్రహించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
