టెహ్రాన్: ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడం మరోవైపు అమెరికా దాడి చేస్తుందనే భయంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు గురువారం (జనవరి 15) తెల్లవారుజూము నుంచి ఎయిర్ స్పేస్‌ను క్లోజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇరాన్‌కు వచ్చే అన్ని రకాల విమాన రాకపోకలపై నిషేధం విధించింది. కేవలం ఇరాన్ నుంచి వెళ్లే విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఉన్నఫళంగా ఇరాన్ గగనతలం మూసివేయడంతో ఆ దేశానికి వెళ్లే విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే.. ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడానికి గల స్పష్టమైన కారణాన్ని మాత్రం ఇరాన్ అధికారులు వెల్లడించలేదు.
కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపు 3 వేల మందికి పైగా చనిపోయారు. మరోవైపు నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతోన్న ఇరాన్ ప్రభుత్వం అల్లర్లను అణిచివేసేందుకు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిరసనకారులను పిట్లల్లా కాల్చి చంపుతుండటంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై హింసా ఇలాగే కొనసాగిస్తే మేం జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు.
ఒకవైపు దేశంలో అల్లర్లు తీవ్ర రూపం దాల్చడం, మరోవైపు దాడులు చేస్తామని బెదిరించడం.. ఇంకోవైపు ఇంటర్నెట్ బంద్ చేయడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థతకు అంతరాయం ఏర్పడటంతో ఇరాన్ ముందస్తు జాగ్రత్తలో భాగంగా తమ గగనతలాన్ని మూసింది. మరోవైపు.. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై ప్రత్యక్ష దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మిడిల్ ఈస్ట్ లోని తమ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను అమెరికా ఇరాన్ వైపు నడిపిస్తోన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరగబోతుందని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
