ఇరాన్‌‌‌‌ ప్రతీకార దాడులు..అబుదాబి, దుబాయ్‌‌‌‌, దోహా, సౌదీ అరేబియాలపై అటాక్‌‌‌‌

ఇరాన్‌‌‌‌ ప్రతీకార దాడులు..అబుదాబి, దుబాయ్‌‌‌‌, దోహా, సౌదీ అరేబియాలపై అటాక్‌‌‌‌
  • బాంబుల మోతతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా​
  • ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన గంటల వ్యవధిలోనే ఎదురుదాడి 
  • అబుదాబి, దుబాయ్‌‌‌‌, దోహా, సౌదీ అరేబియాలపై అటాక్‌‌‌‌

టెహ్రాన్: ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసిన గంటల వ్యవధిలోనే  ఇరాన్ ఎదురుదాడికి దిగింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా అబుదాబి, దుబాయ్‌‌‌‌, దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌‌‌‌లపై మిసైల్స్​ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొన్నది. అబుదాబిలోని ఒక నివాస ప్రాంతంలో క్షిపణి శకలాలు పడటంతో ఆసియాకు చెందిన ఒక పౌరుడు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

‘‘ఇలాంటి చర్యలు ప్రమాదకరమైన ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఇవి పౌరుల భద్రతకు ముప్పు కలిగించే, సుస్థిరతను దెబ్బతీసే పిరికిపంద చర్యలు” అని మండిపడింది. కాగా, ఆకాశంలో మిసైల్స్​ దూసుకెళ్లాయని, భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని దుబాయ్ వాసులు పేర్కొన్నారు.

బహ్రెయిన్​లోని అమెరికా నౌకాదళంపై దాడి

మనామాలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగినట్లు బహ్రెయిన్ తెలిపింది. ‘‘5వ ఫ్లీట్ సేవా కేంద్రం మిసైల్​ దాడికి గురైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం” అని బహ్రెయిన్ జాతీయ సమాచార కేంద్రం పేర్కొంది. జోర్డాన్‌‌‌‌లో సైరన్లు మోగగా, కువైట్ తన గగనతలంలోకి వస్తున్న క్షిపణులను అడ్డుకునేందుకు వైమానిక రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసినట్లు ప్రకటించింది.

 మరోవైపు, తమ భూభాగంపై జరిగిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్టు ఖతార్ తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఖతార్  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. సౌదీఅరేబియా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇది యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నది. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌‌‌‌ను హెచ్చరించింది.

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా..

అమెరికా సైనిక స్థావరాలు ఉన్న నాలుగు ప్రాంతాల్లో ఇరాన్‌‌‌‌ దాడులు చేసింది. అబుదాబిలో యూఏఈ, అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌లు సంయుక్తంగా ‘అల్ దఫ్రా’ ఎయిర్ బేస్‌‌‌‌ను ఉపయోగిస్తున్నాయి. దుబాయ్‌‌‌‌లో జెబెల్ అలీ పోర్ట్.. పశ్చిమాసియాలోనే అమెరికా నౌకాదళానికి అతిపెద్ద పోర్ట్. ఇక దోహా ఖతార్‌‌‌‌లోని 24 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ‘అల్ ఉదైద్’ ఎయిర్ బేస్, అమెరికా సెంట్రల్ కమాండ్‌‌‌‌కు ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్స్‌‌‌‌గా ఉంది. సౌదీఅరేబియాలోని రియాద్‌‌‌‌లో అమెరికాకు చెందిన 2,000 మందికి పైగా సైనికులు ఉన్నారు. 

రియాద్‌‌‌‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ప్రిన్స్ సుల్తాన్’ ఎయిర్ బేస్‌‌‌‌లో పేట్రియాట్ క్షిపణి బ్యాటరీలు, టీహెచ్‌‌‌‌ఏఏడీ వ్యవస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్​ప్రతీకార దాడులకు ఈ టార్గెట్లను ఎంచుకుంది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన మొదటి అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. ఈ అక్రమ దాడులకు బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘‘యుద్ధం మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం” అంటూ వార్నింగ్​ ఇచ్చింది. 

అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన అస్త్రాలు..

  • తొమహాక్ క్రూయిజ్ మిస్సైల్స్: ఇవి అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన క్షిపణులు. రాడార్లకు చిక్కకుండా భూమికి కేవలం 3,0-50 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ, 1,600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి.
  • ఎఫ్-35ఐ 'అదీర్' స్టీల్త్ ఫైటర్స్: ఇవి ఇజ్రాయెల్ సొంత సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌తో రూపొందించుకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు. ఇరాన్ గగనతలంలోకి చొరబడి, శత్రువులకు దొరక్కుండా బాంబుల వర్షం కురిపించగలవు.
  • జీబీయూ28 బంకర్-బస్టర్ బాంబులు: 5,000 పౌండ్ల బరువున్న ఈ బాంబులు అత్యంత పటిష్టమైన కాంక్రీట్ గోడలను చీల్చుకుంటూ వెళ్లి, భూగర్భంలోని అణు కేంద్రాలను, కమాండ్ సెంటర్లను నాశనం చేస్తాయి.
  • జేడీఏఎం గైడెడ్ బాంబులు: ఇవి సాధారణ బాంబులను 'స్మార్ట్'గా మారుస్తాయి. జీపీఎస్ సిగ్నల్స్ లేకున్నా ఫొటోల ఆధారంగా లక్ష్యాన్ని గుర్తించి దెబ్బతీస్తాయి.

ఇరాన్ ప్రయోగించిన వెపన్స్..

  • షహాబ్-3 బాలిస్టిక్ క్షిపణులు: ఇవి ఇరాన్ ప్రధాన రక్షణ కవచం. ఇజ్రాయెల్‌‌‌‌లోని ఏ ప్రాంతాన్నైనా ఇవి నేరుగా తాకగలవు.
  • ఎమాద్ ప్రెసిషన్ క్షిపణులు: ఇరాన్ తయారు చేసిన మొదటి ఖచ్చితత్వం గల బాలిస్టిక్ క్షిపణి ఇది. దీనిని అడ్డుకోవడం శత్రు దేశాలకు చాలా కష్టం.
  • ఘదర్ మీడియం రేంజ్ మిస్సైల్స్: ఇవి షహాబ్-3 కంటే వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణించగలవు. వీటి ద్వారానే ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.