- ట్రంప్ టార్గెట్‌గా 30 నిమిషాల్లో 3 వార్నింగ్‌లు
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య న్యూక్లియర్ ప్రోగ్రామ్ రెండో రౌండ్ పరోక్ష చర్చలు జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను అమెరికా 47 ఏండ్లుగా నాశనం చేయలేకపోయిందని ట్రంప్ ఒప్పుకున్నట్లు గుర్తుచేశారు. ఇప్పడు ట్రంప్ కూడా ఇరాన్‌ను ఏమీ చేయలేరని హెచ్చరించారు. మంగళవారం ఖమేనీ ఎక్స్ వేదికగా ట్రంప్ ను టార్గెట్ చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో మూడు వార్నింగ్ లు ఇచ్చారు. ఖమేనీ మొదటి పోస్ట్‌లో" ట్రంప్ గతంలో చెప్పినట్టు, అమెరికా 47 ఏండ్లుగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాశనం చేయలేకపోయింది. ఆయన నిజాన్ని గొప్పగా ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను చెబుతున్నా. ట్రంప్ కూడా ఇరాన్‌ను నాశనం చేయలేరు" అని వార్నింగ్ ఇచ్చారు. ఇక రెండో పోస్ట్‌లో.." అమెరికా సైన్యమే ప్రపంచంలోనే బలమైనదని ట్రంప్ చెబుతున్నారు.
కానీ, ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి కూడా కొన్నిసార్లు తిరిగి లేవలేనంతగా దెబ్బతినవచ్చు" అని తెలిపారు. ఖమేనీ తన మూడో పోస్ట్‌లో.." భారీ యుద్ధనౌకలను ఇరాన్ వైపు పంపుతున్నామని అమెరికా చెబుతున్నది. యుద్ధనౌక ప్రమాదకరమే. కానీ, అది సముద్రంలో మునిగిపోయేలా చేసే ఆయుధం మరింత ప్రమాదకరం" అని ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని సూచిస్తూ ట్వీట్ చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపడం.. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జెనీవాలో ప్రస్తుతం రెండో రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు పరోక్షంగా మాత్రమే జరుగుతున్నాయి.
అంటే రెండు దేశాల ప్రతినిధులు నేరుగా మాట్లాడుకోవడం లేదు. మధ్యవర్తిగా ఓమన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్బుసైదీ పని చేస్తున్నారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొంటున్నారు. వీళ్లు గతంలో ఓమన్‌లో జరిగిన మొదటి రౌండ్ చర్చల్లోనూ ఉన్నారు. ట్రంప్ కూడా పరోక్షంగా ఈ చర్చల్లో ఉంటానని చెప్పారు. ఇక ఇరాన్ తరఫున
అబ్బాస్ అరాఘ్చీ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు.
