ఇరాన్ ఆర్థిక ప్రతీకారం.. వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లే లక్ష్యంగా దాడులు

ఇరాన్ ఆర్థిక ప్రతీకారం.. వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లే లక్ష్యంగా దాడులు

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్, ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టే వ్యూహానికి తెరలేపింది. పర్షియన్ గల్ఫ్‌‌‌‌లో వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులతో అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో ముడిచమురు ధర గురువారం నాటికి బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటేసింది. ఒకానొక దశలో ఇది 119 డాలర్ల స్థాయికి కూడా చేరుకుంది. 

యుద్ధం ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 200 డాలర్లకూ చేరుతుందని ఇరాన్ హెచ్చరించింది. కాగా,  ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా ఉండే హార్మూజ్ జలసంధిని ఇరాన్ దాదాపు పూర్తిగా స్తంభింపజేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 15 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. బుధవారం ఒక్కరోజే నాలుగు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. 

చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలపై దాడుల వల్ల కూడా చమురు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మరోవైపు అమెరికా నేతృత్వంలోని దళాలు ఇరాన్‌‌‌‌కు చెందిన 16 మైన్లను అమర్చే నౌకలను ధ్వంసం చేశాయి. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.