- దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పేలిన ఇంధన ట్యాంక్
- భారీగా ఎగిసిపడిన మంటలు.. నిలిచిన విమాన సర్వీసులు
- యూఏఈ పోర్టులపై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్
- ఇరాన్‌కు చెందిన 6 క్షిపణులు, 21 డ్రోన్లను కూల్చేసిన యూఏఈ
- చమురు నిల్వలపైకి దూసుకొచ్చిన 35 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న సౌదీ
- బీరుట్‌పై ఇజ్రాయెల్దాడి.. 850 మందికి పైగా మృతి
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పైనా బాంబుల వర్షం
- ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలో 85% ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్ ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అయింది. అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నది. సోమవారం 17వ రోజు క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అయిన ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా బాంబుల మోతలు మోగించింది. చమురు పైప్‌లైన్లు, ఆయిల్ ఫీల్డ్స్‌ను టార్గెట్‌గా చేసుకొని క్షిపణుల వర్షం కురిపించింది.
యూఏఈలోని కీలకమైన చమురు ఎగుమతి కేంద్రం ఫుజైరా సమీపంలో డ్రోన్‌దాడులు జరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి . చమురు లోడింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక తిరిగి కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమైనట్టు సమాచారం. ఈ ఘటనతో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. కాగా, అమెరికా–-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే పశ్చిమాసియాలో రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల (ప్రపంచ సరఫరాలో 7%) చమురు ఉత్పత్తి తగ్గిపోయింది.
ఫుజైరాలో అంతరాయాలు తీవ్రమైతే ఒపెక్‌లో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన యూఏఈ తన ఉత్పత్తిని మరింత తగ్గించాల్సి వస్తుంది. ఫుజైరా ఆయిల్ ఫీల్డ్.. హార్మూజ్ జలసంధి వెలుపల ఉన్న కీలక ప్రాంతం. నిరుడు గణాంకాల ప్రకారం.. ఇక్కడి నుంచి రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనాలు ఎగుమతి అయ్యేవి. ఇది ప్రపంచ డిమాండ్‌లో దాదాపు 1.7 శాతానికి సమానం. కాగా, ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతిచర్యగా, యూఏఈ పోర్టులపై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దుబాయ్‌లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా పోర్ట్, ఫుజైరా పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లిపోవాలని ఇరాన్ వార్తా సంస్థలు హెచ్చరించాయి. అయితే, అబుదాబి ప్రభుత్వ చమురు సంస్థ ‘ఏడీఎన్‌ఓసీ’ ఈ ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ.. ఇప్పటికే రువైస్ రిఫైనరీని మూసివేసింది.
భారత్ నుంచి యూఏఈ వెళ్లే విమానాలు రద్దు
పరిస్థితిని గమనించిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు దుబాయ్‌కి వెళ్లాల్సిన తమ అన్ని సర్వీసులను రద్దు చేశాయి. అయితే అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమా సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించాయి. కేరళ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన రెండు ఎమిరేట్స్ విమానాలు సోమవారం మధ్యలోనే వెనుదిరిగి వచ్చాయి.
సోమవారం తెల్లవారుజామున 4:40 గంటలకు 353 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో బయలుదేరిన తిరువనంతపురం విమానం దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతతో ఉదయం 8:40 గంటలకు తిరిగి తిరువనంతపురంలోనే ల్యాండ్ అయింది. తెల్లవారుజామున 4:30 గంటలకు 325 మందితో బయలుదేరిన కొచ్చి విమానం కూడా మధ్యలోనే వెనుతిరిగి ఉదయం 8:30 గంటలకు కొచ్చిలో సురక్షితంగా దిగింది. దుబాయ్ విమానాశ్రయం మూసివేసినట్లు సమాచారం అందడంతో విమానాలను వెనక్కి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.
6 క్షిపణులు, 21 డ్రోన్ల కూల్చివేత
యూఏఈపై ఇరాన్ మరోసారి విరుచుకుపడగా.. భారీ క్షిపణులు, డ్రోన్లతో భయానక వాతావరణం నెలకొన్నది. ఇరాన్మిసైల్స్, డ్రోన్స్‌ను యూఏఈ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ మేరకు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ వైపు నుంచి వచ్చిన 6 బాలిస్టిక్ క్షిపణులు, 21 డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గగనతలంలోనే పేల్చివేశాయని వెల్లడించింది. అల్ బహ్యా ప్రాంతంలో ఓ వెహికల్‌పై క్షిపణి పడగా.. పాలస్తీనా జాతీయుడు మృతిచెందినట్టు అబుదాబీ అధికారులు తెలిపారు. దాడుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 145 మంది గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ సహా దాదాపు 28 దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్టు సమాచారం. కాగా, యుద్ధం మొదలైనప్పటినుంచి ఇరాన్‌కు చెందిన 304 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ మిసైల్స్, 1,627 డ్రోన్లను యూఏఈ సైన్యం విజయవంతంగా అడ్డుకున్నది. ప్రస్తుతం దుబాయ్, అబుదాబి అంతటా హై అలర్ట్ ప్రకటించారు. విదేశీయులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు..
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. అలాగే, షిరాజ్, తబ్రిజ్‌లాంటి నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లోనే 200కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించినట్టు సమాచారం. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో దాదాపు 85% భాగాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషాని ప్రకటించారు.
దీనివల్ల ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ దాదాపు పూర్తి నియంత్రణ సాధించినట్లయింది. ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణి లాంచర్లలో సుమారు 70% వరకు ఇప్పటికే నిర్వీర్యం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ఇరాన్‌లో ఇంకా వేల సంఖ్యలో లక్ష్యాలు ఉన్నాయని, మరో 3 వారాలపాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలిచ్చింది.
35 డ్రోన్లను అడ్డుకున్న సౌదీ
సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ డ్రోన్లు దూసుకొచ్చాయి. సుమారు 35 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్టు సౌదీ ప్రకటించింది. మరికొన్ని నివేదికల ప్రకారం, గడిచిన 24 గంటల్లో సౌదీ రక్షణ వ్యవస్థలు మొత్తం 60 కంటే ఎక్కువ డ్రోన్లను కూల్చివేసినట్టు తెలుస్తున్నది. ఇవి ప్రధానంగా సౌదీలోని అమెరికా సైనిక స్థావరాలు, చమురు మౌలిక
సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో..
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇరాన్ మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిని యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాశ్రయంలోని విమానాలను టెంపరరీ గా నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌ను కూడా కొన్ని గంటలపాటు మూసివేసినట్టు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీ చేశారు.
విమానాల స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్యాసింజర్లకు సూచించారు. పలు విమానాల ను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
ఇంధన ట్యాంక్‌కు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ ధ్రువీకరించింది. సమీపంలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంక్‌పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచారు.
