మేం ఎప్పుడూ యుద్దాన్ని కోరుకోం.. యుద్దాన్ని ఎప్పుడూ ప్రారంభించం.. అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తే ఊరుకోం..ఆత్మరక్షణ హక్కు మాకు ఉంది.. యుద్దం అంటూ వస్తే మాత్రం వదిలిపెట్టమని ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ పై అమెరికా ప్రత్యక్ష సైనిక చర్య కు దిగుతుందని, ఏ క్షణాన్నైనా యుద్దం వచ్చే అవకాశాలున్నాయని వస్తున్న వార్తల క్రమంలో ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పుడూ యుద్దం కోరుకోదు, యుద్దాన్ని ఎప్పుడూ ప్రారంభించదు, అమెరికా సైనిక చర్యకు గనక దిగితే మాత్రం అమెరికాను ధీటుగా ఎదుర్కొంటామని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కు రాసిన లేఖలో తెలిపారు.
ఇరాన్ పై దాడి చేస్తామని అమెరికా పదే పదే బెదిరిస్తోంది.. డియోగో గార్సియా సైనిక స్థావరం నుంచి దాడికి సిద్దమవుతోంది. ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే, ఈ చర్యలు ఆ ప్రాంతాన్ని సంక్షోభంలో పడేస్తాయని ఇరవానీ అన్నారు.
ఇరాన్ పై అమెరికా పదే పదే బెదిరింపులకు పాల్పడుతోంది.. ఇటీవల అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే దాడి చేస్తామని ట్రంప్ బహిరంగంగానే బెదిరించారు. డియోగో గార్సియా, ఫెయిర్ పోర్టు ఎయిర్ ఫీల్డ్ ను ఉపయోగించే అవసరం వస్తుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఇరవానీ అన్నారు.
అమెరికా సైనిక దురాక్రమణకు దిగితే ఐక్యరాజ్య సమితి చార్టర్ లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణకు అమెరికాను ధీటుగా ఎదుర్కొంటాం.. మరీ విధ్వంసానికి దిగితే అమెరికాను వదిలిపెట్టమని ఇరవానీ హెచ్చరించారు. అటు అమెరికా, ఇటు ఇరాన్ వరుస బెదిరింపు స్టేట్ మెంట్లతో త్వరలో ఇరాన్ పై అమెరికా సైనిక చర్యకు దిగుతుందా? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
