కావాలనే స్కూళ్లపై బాంబులేశారు.. అమెరికాపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఫైర్

కావాలనే స్కూళ్లపై బాంబులేశారు.. అమెరికాపై ఇరాన్  విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఫైర్

టెహ్రాన్:  గత నెల రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 600 కంటే ఎక్కువ పాఠశాలలు దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ఈ దాడుల వల్ల 1,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం లేదా గాయపడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 

జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అత్యవసర చర్చలో ఆయన వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌‌పై జరుగుతున్న సైనిక చర్యల్లో విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నేరమని ఆయన అన్నారు. అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలు ఇలా పాఠశాలలపై దాడులు చేయడం పొరపాటు కాదని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దారుణమని మండిపడ్డారు.

ఇండియన్లకు థ్యాంక్స్.. 

ఇజ్రాయెల్, అమెరికాపై 83వ విడత క్షిపణి దాడుల అనంతరం భారత ప్రజలకు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌‌ పై క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా అందించిన మద్దతు, సంఘీభావానికి భారతదేశంతో సహా అనేక దేశాలకు ఇరాన్ థ్యాంక్స్​ చెప్పింది. ‘థ్యాంక్యూ పీపుల్​ ఆఫ్​ఇండియా" అని పెన్నుతో రాసి ఉన్న ఈ నోట్‌‌ను ముంబైలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ తన ఎక్స్ హ్యాండిల్‌‌లో పంచుకుంది. మరో చిత్రంలో స్పెయిన్, పాకిస్తాన్‌‌ కు కూడా కృతజ్ఞతలు తెలిపింది.