మోరల్ పోలీసింగ్​ను రద్దు చేస్తున్నట్లు ఇరాన్ సర్కార్ ప్రకటన

మోరల్ పోలీసింగ్​ను రద్దు చేస్తున్నట్లు ఇరాన్ సర్కార్ ప్రకటన

టెహ్రాన్: ఇరాన్​లో వెల్లువెత్తిన యాంటీ హిజాబ్ నిరసనలకు ఆ దేశ ప్రభుత్వం రెండు నెలల తర్వాత దిగొచ్చింది. ముస్లిం మహిళలకు డ్రెస్ కోడ్ ను స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు తెచ్చిన ‘మోరాలిటీ పోలీస్’ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘‘మోరాలిటీ పోలీసింగ్ కు న్యాయవ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదు. అందుకే దానిని రద్దు చేశాం” అని అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంతజెరి ప్రకటించినట్లు ఆదివారం ఇరాన్ వార్తా సంస్థ ‘ఐఎస్ఎన్ఏ’ వెల్లడించింది. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ అధ్యక్షతన శనివారం జరిగిన ‘సుప్రీం కౌన్సిల్ ఆఫ్​ది కల్చరల్ రెవల్యూషన్’ సంస్థ సమావేశంలో ఈ మేరకు అటార్నీ జనరల్ ప్రకటన చేసినట్లు పేర్కొంది. శనివారం ఇబ్రహీం రైసీ ఓ టీవీ చానెల్ ద్వారా మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్, ఇస్లామిక్ విధానాలనే ఇరాన్ అనుసరిస్తోందని, అయితే, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కొంత ఫ్లెక్సిబుల్​గా ఉండాలని కూడా అభిప్రాయపడినట్లు వివరించింది.  

అమినీ మృతితో రేగిన చిచ్చు  

డ్రెస్ కోడ్ పాటించలేదంటూ మహ్ షా అమినీ (22) అనే ఇరానియన్ కుర్దిష్ యువతిని మొరాలిటీ పోలీసులు సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత సెప్టెంబర్ 16న మరణించింది. దీంతో ఆ మరునాటి నుంచే దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. మహిళలంతా రోడ్ల మీదకు వచ్చి హిజాబ్​లను కాలబెట్టారు. జుట్టు కత్తిరించుకున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిరసనలు తెలిపారు. పురుషులు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ నిరసనలను అల్లర్లుగా ప్రకటించిన అధికారులు నిరసనకారులపై ఉక్కుపాదం మోపారు. అయినా మోరల్ పోలీసింగ్​కు వ్యతిరేకంగా దేశమంతటా నిరసనలు పాకాయి. 

ప్రాణాలు కోల్పోయిన 300 మంది..

మోరల్ పోలీసింగ్​కు వ్యతిరేకంగా 2 నెలలకు పైగా జరిగిన ఆందోళనల్లో 300 మందికి పైగా బలయ్యారని, పోలీసుల్లో కూడా పలువురు అల్లర్లలో చనిపోయారని సోమవారం ఇరాన్ జనరల్ ఒకరు తెలిపారు. అయితే, సెక్యూరిటీ బలగాల చేతిలో మంగళవారం నాటికి 448 మంది నిరసనకారులు మరణించారని, వీరిలో 64 మంది మైనర్లు ఉన్నారని ఓస్లోకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. ఇక రెండు నెలల్లో18 వేల మందికి పైగా నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, దేశంలో అవినీతిని పెంచడం ద్వారా ఇస్లామిక్ విలువను నాశనం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని.. అల్లర్ల వెనక అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, కుర్దిష్ గ్రూపుల పాత్ర ఉందని ప్రెసిడెంట్ రైసీ ఆరోపించారు.

2006 నుంచి మోరాలిటీ పోలీసింగ్ 
ఇరాన్​లో అమెరికా సపోర్ట్ ఉన్న రాచరిక 

ప్రభుత్వం1979లో ఇస్లామిక్ రెవల్యూషన్​తో కూలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం1983లో దేశంలో మహిళలు, పురుషులకు డ్రెస్ కోడ్​ను విధించింది. 2005లో మహ్మద్ అహ్మదినెజాద్ అధికారంలోకి వచ్చిన తర్వాతే  ‘గష్తీ ఎర్షాద్ (గైడెన్స్ పెట్రోల్)’ పేరిట మోరాలిటీ పోలీస్ విభాగాన్ని నెలకొల్పారు. హిజాబ్ కల్చర్​ను పరిరక్షించేందుకు 2006లో మోరాలిటీ పోలీస్ యూనిట్లను ప్రారంభించారు. మహిళలు హిజాబ్​ లేకుండా బయటకు వచ్చినా, షార్ట్ వేసుకున్నా, చిరుగుల జీన్స్  ధరించినా అరెస్ట్ చేసే అధికారం కట్టబెట్టారు.  ఈ ఏడాది జులైలో ఇబ్రహీం రైసీ ప్రెసిడెంట్ అయ్యాక ఈ రూల్స్ స్ట్రిక్ట్ చేశారు.