
- ఖమేనీని గౌరవిస్తేనే డీల్ ....అవమానాలు, బెదిరింపులను సహించం
టెహ్రాన్ / టెల్ అవీవ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పట్ల అవమానకరంగా కామెంట్లు చేయడం మానుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. తమతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ నిజంగా అనుకుంటే.. ముందుగా ఖమేనీని గౌరవప్రదంగా సంబోధించాలన్నారు.
ఇజ్రాయెల్ తో యుద్ధంలో తామే గెలిచామని, అమెరికాకు చెంపదెబ్బ కొట్టామంటూ ఖమేనీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయనపై ట్రంప్ శుక్రవారం ఘాటుగా కామెంట్లు చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తనకు తెలిసినా, చంపకుండా ఆపానని.. లేకపోతే ఆయన అతి నీచమైన, దారుణమైన విధంగా చనిపోయి ఉండేవారని అన్నారు.
యుద్ధంలో తామే గెలిచామని ఖమేనీ అబద్ధాలు చెప్పారన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలకు అబ్బాస్ అరాగ్చీ శనివారం ‘ఎక్స్’లో కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్ల ధాటికి తట్టుకోలేక, వేరే దారి లేక.. ఇజ్రాయెల్ ‘‘డ్యాడీ(ట్రంప్)” వద్దకు పరుగెత్తిందన్నారు. తాము స్వాతంత్ర్యానికి అత్యంత విలువ ఇస్తామని, బెదిరింపులు, అవమానాలను సహించబోమన్నారు. ట్రంప్ నిజంగా డీల్ ను కోరుకుంటే.. ముందు తన గొంతును సరి చేసుకోవాలని స్పష్టం చేశారు.
12 రోజుల యుద్ధంలో 80 థాడ్ మిసైల్స్ ప్రయోగం
ఇరాన్ తో 12 రోజుల యుద్ధంలో శత్రు దేశం నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ మిసైల్స్ నుంచి ఇజ్రాయెల్ ను రక్షించేందుకు అమెరికా ఏకంగా 60 నుంచి 80 థాడ్ మిసైల్స్ ను ప్రయోగించిందని సౌత్ కొరియాకు చెందిన ‘మిలిటరీ వాచ్ మ్యాగజైన్’ వెల్లడించింది. ఒక్కో థాడ్ మిసైల్ ఖరీదు రూ. 128 కోట్ల వరకూ ఉంటుందని, మొత్తం 80 క్షిపణులకు లెక్కిస్తే.. ఏకంగా ఈ మిసైళ్లకు అమెరికా చేసిన ఖర్చే రూ. 7 వేల కోట్ల వరకూ అవుతుందని అంచనా వేసింది.
ఇటీవలి యుద్ధంలో ఇజ్రాయెల్ పైకి ఘాదర్, ఎమాద్, ఖీబర్, షెకాన్, ఫతా1 వంటి క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. వీటిలో ఫతా1 బాలిస్టిక్ మిసైల్ హైపర్ సోనిక్ రకానికి చెందినది కావడంతో ధ్వని కంటే 15 రెట్ల (మ్యాక్ 15) స్పీడ్ తో దూసుకొచ్చే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన ఇతర షార్ట్, మీడియం, ఇంటర్ మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ లో థాడ్ ఇంటర్ సెప్టర్ క్షిపణులను అమెరికా మోహరించిందని ఆ మ్యాగజైన్ పేర్కొంది.
‘‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (థాడ్)’ మిసైళ్లను అమెరికా ఏటా 50 నుంచి 60 వరకు మాత్రమే తయారు చేస్తుంది. అయితే, ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా తన వద్ద ఉన్న థాడ్ మిసైల్స్ లో 15 నుంచి 20 శాతం (60 నుంచి 80 మిసైల్స్)ను కేవలం 12 రోజుల్లోనే వినియోగించినట్టు అయింది. ఈ స్టాక్ ను మళ్లీ భర్తీ చేసుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టవచ్చు” అని వివరించింది.