ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ లారిజానీ మృతి

ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ లారిజానీ మృతి
  • అంతం చేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జ్ 
  • బాసిజ్ కమాండర్ సులేమానీని కూడా హతమార్చామని ప్రకటన 
  • ఇరాన్ సర్కారు కూల్చివేతకు ప్రజలకు ఇదే మంచి చాన్స్ అని కామెంట్ 
  • వీరి మరణ వార్తలపై స్పందించని ఇరాన్

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ(67)ని తమ సైన్యం మట్టుబెట్టిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించారు. ఇరాన్ సర్కారును కూలదోసేందుకు అక్కడి ప్రజలకు ఇదే మంచి అవకాశమని అన్నారు. "ఈ ఉదయం మేం అలీ లారిజానీని అంతం చేశాం. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాలిస్తున్న గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ల ముఠా అయిన రెవల్యూషనరీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆయనే బాస్" అని నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపారు. 

లారిజానీతో పాటు బాసిజ్ దళాల కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్ ఘోలమ్ రెజా సులేమానీ(62)ని కూడా హతమార్చినట్లు వెల్లడించారు. వీరు టెహ్రాన్ సహా ఇతర నగరాల్లోని సామాన్య ప్రజలపై హింసకు పాల్పడుతూ భయోత్పాతం సృష్టిస్తున్న ముఠా సభ్యులు అని అభివర్ణించారు. వాయుసేన విమానాలు, డ్రోన్ల సాయంతో తాము ఇరాన్ పై నిరంతరం దాడులు చేస్తున్నామని చెప్పారు. 

ఇరాన్ సర్కారును తొలగించడం అనేది ఒక్కసారిగా లేదా సులభంగా జరిగే పని కాదని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. అయితే తాము ఇలాగే దాడులు కొనసాగిస్తే.. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే అవకాశం లభిస్తుందన్నారు. అంతకుముందు అలీ లారిజానీని, సులేమానీనీ మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా ప్రకటించారు. ఇది ఆ దేశ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అని ఆయన పేర్కొన్నారు. అయితే, అలీ లారిజానీ, సులేమానీ మరణించారన్న వార్తలపై ఇరాన్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. 

కాగా, అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌తో పోరాటంలో టెహ్రాన్ వెనకడుగు వేయదని సోమవారమే లారిజానీ ముస్లిం ప్రపంచానికి సందేశం ఇచ్చారు. ఇరాన్‌‌‌‌పై దాడుల టైమ్​లో ముస్లిం దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "చర్చల సమయంలోనే అమెరికా-, జియోనిస్ట్ శక్తులు ఇరాన్‌‌‌‌ను విచ్ఛిన్నం చేసేందుకు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లోనే మన సుప్రీం లీడర్​తో పాటు పలువురు పౌరులు, సైనిక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

టెహ్రాన్, బీరుట్ పై ఉధృత దాడులు 
ఇరాన్ రాజధాని టెహ్రాన్ అంతటా "భారీ స్థాయిలో దాడులు" చేశామని, లెబనాన్‌‌‌‌లోని ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మిలిటెంట్లపై దాడులనూ ఉధృతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించింది. తెల్లవారుజామున ఇరాన్ నుంచి కూడా టెల్ అవీవ్, ఇతర ప్రాంతాల వైపు రెండు విడతలుగా క్షిపణులు వచ్చినట్లు వెల్లడించింది. 

ఉత్తర ఇజ్రాయెల్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా కూడా దాడులు చేసిందని పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌‌‌‌లో 1,300 మందికి పైగా మరణించారని ఇరాన్ రెడ్ క్రెసెంట్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల 10 లక్షల మందికి పైగా లెబనాన్ ప్రజలు నిరాశ్రయులయ్యారు. లెబనాన్‌‌‌‌లో ఇప్పటివరకు 850 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.  కాగా, ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్‌‌‌‌లో 12 మంది, అమెరికా సైన్యానికి చెందిన కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సౌదీ, ఖతార్, ఇరాక్​లోనూ ఇరాన్ అటాక్స్ 
చమురు మౌలిక సదుపాయాలకు నిలయమైన తమ తూర్పు ప్రాంతంపైకి వచ్చిన డజనుకు పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. ఖతార్ రాజధానిలో కూడా తెల్లవారుజామున పేలుడు శబ్దాలు మిన్నంటాయి. నగరంపై జరిగిన క్షిపణి దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ శకలాలు పడ్డాయి. 

ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న నాలుగు డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు. బాగ్దాద్‌‌‌‌లోని అల్-జాద్రియా ప్రాంతంలో అత్యంత భద్రత కలిగిన ప్రెసిడెన్షియల్ కాంపౌండ్‌‌‌‌లోని ఒక ఇంటిపై కూడా దాడి జరిగింది. ఈ దాడులకు బాధ్యులు ఎవరనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ మద్దతు గల మిలీషియాలు ఇరాక్​లోని అమెరికా లక్ష్యాలపై నిరంతరం దాడులు చేస్తున్నాయి.

గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు   
ఇరాన్ తన పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై, ఇజ్రాయెల్‌‌‌‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోంది. పదేపదే లక్ష్యంగా మారుతున్న యూఏఈ తూర్పు తీరంలోని ఫుజైరా చమురు కేంద్రాన్ని ఇరాన్ తాజా దాడిలో పూర్తిగా దెబ్బతీసింది. మంగళవారం తెల్లవారుజామున ఫుజైరా తీరంలో లంగరు వేసిన ఒక ట్యాంకర్‌‌‌‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌‌‌‌పై దాడితో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 20 నౌకలు ఇలాంటి దాడులకు గురయ్యాయి. 

యూఏఈలో కూల్చివేసిన క్షిపణి శకలాలు పడి ఒక వ్యక్తి మరణించగా.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరిందని అధికారులు చెప్పారు. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నట్లు యూఏఈ సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. కాసేపటికే ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. శత్రువుల దాడులను అడ్డుకునే క్రమంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి.

ట్రంప్‌‌‌‌పై ‘ఎక్స్’లో లారిజానీ విమర్శలు ! 
ఇరాన్ ప్రభుత్వ మీడియా 'ప్రెస్ టీవీ' మంగళవారం లారిజానీ పేరుతో ‘ఎక్స్’లో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌ను తీవ్రంగా విమర్శించారు. "47 ఏళ్ల క్రితం ఇరాన్ విప్లవ సమయంలో వీధుల్లో ప్రజల నినాదాలు నిజం కావని, అవి కేవలం టేప్ రికార్డింగ్ శబ్దాలని అప్పటి పహ్లావి ప్రభుత్వం క్లెయిమ్ చేసింది. ఇప్పుడు ట్రంప్ కూడా ఇరాన్ నగరాల్లో జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల చిత్రాలను ఏఐ ద్వారా సృష్టించామంటున్నారు. ఇరాన్ ప్రజల చారిత్రక విజయం దగ్గర్లోనే ఉంది" అని అన్నారు.