శత్రువులను మట్టికరిపించి తీరుతాం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్

శత్రువులను మట్టికరిపించి తీరుతాం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్

టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ దూకుడుతో పశ్చిమాసియా దేశాల్లో హై టెన్షన్ నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటుడటంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉన్న క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దేశ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఇవాళ (అక్టోబర్ 4) సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఖమేనీ ప్రసగించారు. ఈ సందర్భంగా పాలస్తీనియన్లు, లెబనీస్ ఉద్యమాలకు మద్దతుగా మాట్లాడిన ఖమేనీ.. తమ శత్రువులను (ఇజ్రాయెల్) ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్‎పై ఇటీవల ఇరాన్ చేసిన దాడులను సరైన చర్యగా ఆయన అభివర్ణించారు. 

లెబనీస్, పాలస్తీనియన్ల ఆక్రమణకు వ్యతిరేకంగా నిలబడిన తమపై అభ్యంతరం, నిరసన తెలిపే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదని ఖమేనీ స్పష్టం చేశారు. కాగా, హమాస్, హిజ్బొల్లా టాప్ లీడర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీనికి ప్రతీకారంగా ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్‎పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ చేసిన దాడికి బదులు తీర్చుకోవాలని ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఊగిపోతోంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ ను ఓడించి తీరుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రతిజ్ఞ చేయడంతో ఈ దాడులు ఏ వైపునకు దారి తీస్తాయోనని పశ్చిమాసియాతో పాటు ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. 

"