ఐఆర్‌‌‌‌సీటీసీ కుంభకోణం కేసు..లాలూ కుటుంబానికి బిగ్‌‌ షాక్‌‌

ఐఆర్‌‌‌‌సీటీసీ కుంభకోణం కేసు..లాలూ కుటుంబానికి బిగ్‌‌ షాక్‌‌
  • ఐఆర్‌‌‌‌సీటీసీ కుంభకోణం కేసు
  • లాలూ, రబ్రీదేవి, తేజస్వీపై ఢిల్లీ కోర్టులో అభియోగాలు నమోదు

న్యూఢిల్లీ: ఐఆర్‌‌‌‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారంటూ బిహార్‌‌‌‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌‌ యాదవ్‌‌ కుటుంబంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం అభియోగాలు నమోదు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్‌‌(ఆర్జేడీ) వ్యవస్థాపకుడు లాలూ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీదేవి, కొడుకు తేజస్వీ యాదవ్‌‌పై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద ఆరోపణలు నమోదయ్యాయి. 

లాలూ ప్రసాద్‌‌ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో ఐఆర్‌‌‌‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టు ఓ ప్రైవేటు హోటల్‌‌కు కేటాయించి..  బదులుగా కోట్లాది రూపాయల ఖరీదైన రెండెకరాల జాగాను అగ్గువకే పొందారని సీబీఐ ఆరోపిస్తోంది. దీనిపై ఢిల్లీలోని రౌస్‌‌ అవెన్యూ కోర్టు అభియోగాలు ఫైల్ చేయగా..  తామంతా నిర్దోషులమని, ఇదో తప్పుడు కేసు అని లాలూ కుటుంబం తరఫున లాయర్‌‌‌‌ వాదనలు వినిపించారు. 

హోటల్స్‌‌ కాంట్రాక్టు టెండర్లు న్యాయబద్ధంగా జరిగాయన్నారు. ఆరోపణలను అంగీకరించే ప్రసక్తే లేదని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఈ కుంభకోణం కేసు విచారణ దశకు చేరుకున్నట్లయింది.

వచ్చే నెలలోనే బిహార్‌‌‌‌లో ఎలక్షన్లు.. 

2004 నుంచి 2009 వరకు లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌‌‌‌సీటీసీ హోటల్స్‌‌ కాంట్రాక్ట్‌‌ సుజాత హోటల్‌‌కు అప్పగించారు. ప్రతిఫలంగా లాలూకు చెందిన ఓ కంపెనీకి ఖరీదైన మూడెకరాల జాగాను తక్కువ ధరకే బదిలీ చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. 

లాలూ కుటుంబంపై 2017లో ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేసింది. అధికార దుర్వినియోగం చేసి సొంతలాభం పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీబీఐ వాదిస్తోంది. మరోవైపు, వచ్చే నెలలో బిహార్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కోర్టులో అవినీతి ఆరోపణల నమోదుతో లాలూ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.