Asia Cup 2025: ఇండియాలోని ఆ రెండు రాష్ట్రాలు పాకిస్థాన్‌ను ఓడించగలవు: దాయాధి దేశానికి పఠాన్ కౌంటర్

Asia Cup 2025: ఇండియాలోని ఆ రెండు రాష్ట్రాలు పాకిస్థాన్‌ను ఓడించగలవు: దాయాధి దేశానికి పఠాన్ కౌంటర్

ఆసియా కప్ 2025 లీగ్ మ్యాచ్ లో టీమిండియా దెబ్బకు పాకిస్థాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మన బౌలర్ల విజృంభణకు తలవంచారు. పాకిస్థాన్ ను పసికూన జట్టు చేసి భారత బౌలర్లు దాయాధి జట్టును కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ ధాటికి పాక్ బౌలర్లు నిలవలేకపోయారు. ఆడుతూ పాడుతూ సూర్య సేన కేవలం 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. మ్యాచ్ మొత్తంలో పాకిస్థాన్ జట్టు ఏ విభాగంలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాకిస్థాన్ జట్టును తీసి పడేశాడు. 

పాకిస్థాన్ క్రికెట్ జట్టును ఇండియాను ఓడించే సీన్ లేదని తేల్చి చెప్పాడు. భారత దేశవాళీ జట్టు కూడా పాకిస్థాన్‌ను ఓడించగలదని ఈ మాజీ ఆల్ రౌండర్ విమర్శించాడు. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తోన్న ముంబై, పంజాబ్ వంటి జట్లు పాకిస్థాన్‌ను ఓడించగలవని పఠాన్ అన్నాడు. " భారత దేశవాళీ జట్లలో ఏది పాకిస్థాన్‌ను ఓడించగలదని మీరు అడిగితే.. ముంబై ఓడించగలదని నేను ఖచ్చితంగా చెప్పగలను. పంజాబ్ సైతం వారిని ఓడించగలదు". అని పఠాన్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చెప్పుకొచ్చాడు. 

ముంబై మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ కూడా పఠాన్ భావనను ఏకీభవించాడు. “మేము ఆటను ఎలా నిర్మించాలో ఆలోచిస్తున్నాము. పాకిస్తాన్ స్పిన్నర్లతో వచ్చింది. ఫాస్ట్ బౌలర్లు లేరు. వారి బౌలింగ్ భిన్నంగా ఉంది. ఆట ప్రారంభం నుండి చివరి వరకు ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ అసలు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇండియా ఏ జట్టు ఇండియాపై ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్టు అనిపించింది". అని  నాయర్ అన్నాడు. ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ ఆసియా కప్ గ్రూప్-ఏ లో ఉన్నాయి. రెండు విజయాలతో ఇండియా ఇప్పటికే సూపర్-4 కు అర్హత సాధించగా.. యూఏఈపై బుధవారం (సెప్టెంబర్ 17) జరగబోయే మ్యాచ్ గెలిస్తేనే పాకిస్థాన్ సూపర్-4 కు వెళ్తుంది.