సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు కల్పించాలి

సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు కల్పించాలి
  • పసి పిల్లల తల్లులపై హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపుతున్నారు
  • బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సాధికారికత అని ఊదరగొడుతూ.. మరో వైపు పోడు భూముల ఆక్రమణల పేరుతో హత్యాయత్నం కేసులు పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పసి పిల్లల తల్లులై కూడా హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపుతుండడం దురదృష్టకరమన్నారు. పోడు భూముల ఆక్రమించారనే నెపంతో గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం యల్లన్ననగర్ పోడు భూముల బాధితులను మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా అడవిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్న అమాయక గిరిజనులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలులో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని గిరిజనులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన వారిలో ముగ్గురు పసిపిల్లల తల్లులండడంపై విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు కల్పించాలి
సీ.ఎం కేసీఆర్ ఓవైపు దళిత సాధికారత అంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతు మరోవైపు పోడుభూముల ఆక్రమన పేరుతో గిరిజనులపై ఉక్కుపాదం మోపుతోందని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిఎస్పీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ తదితరులు ఉన్నారు.