‘ఉపాధి’లో సోషల్  ఆడిట్ ఉత్తదేనా?

‘ఉపాధి’లో సోషల్  ఆడిట్ ఉత్తదేనా?

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. చేయని పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి వేతనాలు స్వాహా చేస్తున్నారు. అయినా ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సోషల్ ఆడిట్​లో అక్రమాలు బయటపడుతున్నా.. నామమాత్రపు చర్యలు తీసుకుంటూ వదిలేస్తున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ. కోటికిపైగా అక్రమార్కులు సొంతానికి వాడుకున్నట్లు సోషల్ ఆడిట్​ద్వారా బయటపడింది. వీటిలో ఇప్పటి వరకు కేవలం రూ. 37.44 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు ఆఫీసర్లు తెలిపారు. మిగతా డబ్బులు ఏమయ్యాయో.. ఎటుపోయాయో ఇంకా తేల్చలేదు. 

రకరకాల పనులు

ఉపాధి హామీ కింద నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలు, బావుల్లో పూడిక తీయడం, వ్యవసాయ క్షేత్రాలు చదును చేయడం, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, కల్లాల నిర్మాణం చేపట్టారు. పనుల్లో కూలీలకు చెల్లించిన వేతనాలు.. జరిగిన పనులపై ఏటా సోషల్ ఆడిట్ నిర్వహించారు. చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున్న అక్రమాలు వెలుగుచూశాయి. అయినా ఆఫీసర్లు అక్రమార్కుల నుంచి ఏళ్లకేళ్లుగా డబ్బులు రికవరీ చేయలేదు.. బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దీంతో అక్రమాల్లో ఆఫీసర్ల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

​నో ఫీల్డ్​విజిట్...

జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి పనుల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫీల్డ్ విజిట్​చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు చేస్తున్నారు. కూలీలు పనులు చేయకున్నా.. చేసినట్లు రికార్డు చేస్తున్నారు. అంతేకాదు పనులు ఎక్కడ చేస్తున్నారనేది ఆఫీసర్లకు తెలియడంలేదు. బోర్డులపై ప నులు, ఖర్చుల వివరాలు నమోదు చేయడంలేదు. 

ప్రభావం చూపని సంస్కరణలు...

ఉపాధి హామీ పథకం అమలులో అవినీతి జరుగుతున్నట్లు తేల్చిన కేంద్ర ప్రభుత్వం ఆన్​లైన్​లో పనులు వివరాలు ఉంచాలని.. కూలీలకు డిజిటల్ చెల్లింపులు చేపట్టాలని ఆదేశించింది. కూలీల ఖాతాలను ఆధార్ తో అనుసంధానం చేసింది. పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్)ను అమలు చేస్తోంది. పనిచేసే స్థలం నుంచే కూలీలు తమ ఫొటోలను అప్​లోడ్​చేయాలని సూచించింది. అయినా  అక్రమాలు ఆగడంలేదు.

పారదర్శకంగా పనులు...

ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులతో పాటు కూలీల విషయంలో పారదర్శకత పాటిస్తున్నాం. సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ జరిగిన అక్రమాలపై దృష్టిసారించాం. డబ్బుల రికవరీకి చర్యలు తీసుకుంటున్నాం. కూలీలకు పూర్తిస్థాయిలో పనికల్పిస్తున్నాం. వేతనాల చెల్లింపు పకడ్బందీగా చేపడుతున్నాం. ఎక్కడ కూడా తప్పులు జరగడంలేదు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతాం.
– విజయలక్ష్మి, ఈజీఎస్, పీడీ