జనరేటర్​తో ప్రెస్​మీట్​ పెట్టి..కరెంట్​ పోయిందంటవా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

జనరేటర్​తో ప్రెస్​మీట్​ పెట్టి..కరెంట్​ పోయిందంటవా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  వాస్తవాలను వక్రీకరించడం కేసీఆర్​కే చెల్లిందని, సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఆయన మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధమని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘‘ఇప్పటికే ఆయనకు అధికారం పోయింది.. త్వరలోనే బీఆర్​ఎస్​ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుందనే ఫ్రస్ట్రేషన్​లో కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నడు. ఓ వైపు కూతురు కవిత జైల్లో ఉంది. ఇంకో వైపు కాళేశ్వరం స్కామ్​, పశువుల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వరుస స్కామ్​లు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ​ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని మంత్రి ఉత్తమ్​ అన్నారు. ఇప్పటి వరకు 200 మందికిపైగా నేతలు బీఆర్ఎస్ ను విడిచిపెట్టి వెళ్లింది మాత్రం నిజమని తెలిపారు.

కేసీఆర్ సూర్యాపేటలో జనరేటర్ తో ప్రెస్ మీట్ పెట్టి, కరెంట్ పోయిందనే తప్పుడు మాటలు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్తుకు ఎంత డిమాండ్ ఉన్నా సరే.. 24 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు.