
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ మోడల్ స్టడీస్‌ను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఈఎన్‌సీ(జనరల్) అనిల్ కుమార్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేందర్ రావు నేతృత్వంలోని ఇంజినీర్లు గురువారం ఐఐటీ రూర్కీకి వెళ్లారు.
అక్కడ ఏర్పాటు చేసిన మేడిగడ్డ బ్యారేజీ మోడల్ స్టడీస్‌ను పరిశీలించారు. బ్యారేజీ కుంగినందున సీకెంట్ పైల్స్, షీట్ పైల్స్, గేట్ల వెయిట్స్, రాఫ్ట్, సీసీ బ్లాకుల పనితీరును మోడల్ స్టడీస్ ద్వారా విశ్లేషించారు. ఎక్కడ లోపం జరిగింది.. ఎందుకు కుంగింది? సీకెంట్ పైల్స్‌లో ఎక్కడ లోపాలున్నాయి? సీసీ బ్లాకుల పటిష్టత, గేట్ల పనితీరు వంటి అంశాలను పరిశీలించారు.
బ్యారేజీ తట్టుకునే వరద మోడల్స్‌ను కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. బ్యారేజీలో వాటర్ స్టోరేజీ అంశంపైనా మోడల్ స్టడీస్‌లో పరీక్షించనున్నారు. వాస్తవానికి బ్యారేజీని 3 టీఎంసీల స్టోరేజీ కోసమే డిజైన్ చేయాల్సి ఉన్నా.. 5 టీఎంసీలకు పెంచడంతో దానిపై భారం పడిందన్న అభిప్రాయాలున్నాయి. సామర్థ్యం పెంపు కూడా బ్యారేజీపై ఎఫెక్ట్ చూపించిందా అన్న అంశాన్ని ఈ స్టడీస్ ద్వారా తేల్చనున్నారు. శుక్రవారం కూడా ఐఐటీ రూర్కీలో బ్యారేజీ మోడల్ స్టడీస్‌ను అధికారులు పరిశీలించనున్నారు.