- కొత్తగా కట్టే ప్రాజెక్టుల కింద 72.24 లక్షలకు ఇవ్వాల్సి ఉండగా..
- ఇచ్చింది 20.22 లక్షల ఎకరాలకే..
- సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు గప్పాలు కొట్టుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే అంతా సాధ్యమైందని ప్రచారాలూ చేసుకుంది. కానీ, అసలు టార్గెట్ పెట్టుకున్న దాంట్లో సగమంటే సగం భూములకే సాగునీళ్లందాయని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1.27 కోట్ల ఎకరాల ఆయకట్టును సాధించేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే.. ఇప్పటిదాకా అందులో సాధించిన లక్ష్యం కేవలం 74.51 లక్షల ఎకరాలేనని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే టార్గెట్ పెట్టుకున్న ఆయకట్టులో సాధించింది 58 శాతమే. బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.
ఇక కొత్తగా నిర్మిస్తున్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 72.24 క్షల ఎకరాలకు నీళ్లివ్వాలని టార్గెట్ పెట్టుకుంటే.. అందులో వచ్చిన ఆయకట్టు కేవలం 20.22 లక్షల ఎకరాలే. ఈ కొత్త ప్రాజెక్టుల కింద మరో 52.02 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల (భారీ, మధ్యతరహా) కింద 24.41 లక్షల ఎకరాలకు పూర్తి ఆయకట్టును సాధించారు. కాగా, మైనర్ ఇరిగేషన్ కింద 25.71 లక్షల ఎకరాలకు 25.12 లక్షలు, ఐడీసీ లిఫ్టుల కింద 5.33 లక్షల ఎకరాలకు 4.76 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించారు. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల కింద ఇంకా బ్యాలెన్స్ 53.18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
31 ప్రాజెక్టులు పూర్తి కావాలె..
రాష్ట్రంలో 73 ప్రాజెక్టులుండగా.. అందులో 34 మేజర్, 39 మీడియం ప్రాజెక్టులున్నాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 42 పూర్తయ్యాయి. మరో 31 ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో 24 ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులే ఉండడం గమనార్హం. అయితే, ఆయా ప్రాజెక్టులను ప్రభుత్వం కేటగిరీలవారీగా విభజించుకుని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. కేటగిరి ఏ కింద 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను చేర్చారు. నీల్వాయి, పాలెంవాగు, మత్తడివాగు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2, సదర్మాట్ బ్యారేజ్, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను ఈ విభాగంలో చేర్చి పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే సదర్మాట్ బ్యారేజీని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రారంభించింది. కేటగిరి బీ కింద 75 శాతం పూర్తయిన ప్రాజెక్టులను చేర్చారు.
వీటిలో చిన్న కాళేశ్వరం, మోడికుంటవాగు, లోయర్ పెన్‌గంగ, చనాక కొరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ, గౌరవెల్లి, కోయిల్‌సాగర్ లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్, నెట్టెంపాడు లిఫ్ట్, కల్వకుర్తి లిఫ్ట్, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను చేర్చింది. వీటిని ప్రాధాన్యపరంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్, ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జకోరా చండూరు లిఫ్ట్, కుమ్రంభీం ప్రాజెక్ట్, మంజీరా లిఫ్ట్, గట్టు లిఫ్ట్ ప్రాజెక్టులనూ ప్రాధాన్యపరంగా ముందుకు తీసుకెళ్లనుంది. వాటికి అదనంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మించతలపెట్టింది. 15 ప్రాజెక్టుల పరిధిలో పరిహారం కింద 147 గ్రామాలకు చెందిన ప్రజలకు రూ.3900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 2025 డిసెంబర్‌నాటికి రూ.2750 కోట్లను అందించారు.
గ్రౌండ్ వాటర్ పెరిగింది..
రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ స్థాయిలు పెరిగాయి. 2024–25 మధ్య భూగర్భజలాలు పెరిగాయని, భవిష్యత్ అవసరాలకూ ఢోకా ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) లెక్కల ప్రకారం.. 2024లో 20,402 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేర గ్రౌండ్‌వాటర్ స్థాయిలుండగా.. 2025లో 21,926 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. 7 శాతం మేర భూగర్భజలాలు పెరిగాయి. అందులో 8,466 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్లను 2024లో వాడుకోగా.. 2025లో అది 9,262 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. 9 శాతం వృద్ధి నమోదైంది.
