వెలుగు ఓపెన్ పేజీ.. బీఆర్‌ఎస్ ను కొట్టి..బీజేపీ ఎదుగుతోందా?

వెలుగు ఓపెన్ పేజీ.. బీఆర్‌ఎస్ ను కొట్టి..బీజేపీ ఎదుగుతోందా?

తెలంగాణలో పార్టీ  విస్తరణకు  ఉత్తర  తెలంగాణను  ‘ప్రయోగశాల’గా  మలచుకోవడంలో బీజేపీ  సఫలమౌతోందా?  వారికక్కడ  క్రమంగా  స్థిరపడుతున్న రాజకీయ మద్దతు,  ఎన్నికల్లో  గెలుపు  పరిణామాలు ఇదే విషయాన్ని  ధృవీకరిస్తున్నాయి.  రాష్ట్రం  ఏర్పడ్డ  నుంచి  దాదాపు  పదేళ్లు  అధికారంలో ఉండి 2023  ఎన్నికల్లో  ఓడిన  భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)  రాజకీయ  తప్పిదాలు బీజేపీ ఎదుగుదలకు  నిచ్చెనలయ్యాయా?  రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే  చర్చనీయాంశమౌతోంది.  

ఈ సమీకరణం  ఇలాగే కొనసాగితే...  బీజేపీ  దక్షిణ తెలంగాణలోనూ  పాగావేసే  అవకాశాలెలా  ఉంటాయి?  ఉత్తర  తెలంగాణలో  బీజేపీ  విస్తరణకు అనుకూలించిన ‘హిందూత్వ కార్డు’ దక్షిణ తెలంగాణలో  కూడా పనిచేస్తుందా?  అదే  జరిగితే  బీఆర్‌ఎస్‌ను  పక్కకు నెట్టి,  మొత్తం  తెలంగాణలోనే  బీజేపీ  ప్రత్యామ్నాయ  రాజకీయ శక్తిగా  మారుతుందా?  ప్రస్తుతానికి  ఇవన్నీ శేష ప్రశ్నలే!  రేపటి  మున్సిపల్​ కార్పొరేషన్  ఎన్నికలు,  అటుపై  వచ్చే  ఎంపీటీసీ,  జడ్పీటీసీ ఎన్నికలు ఈ అంశాన్ని తేల్చవచ్చని  రాజకీయ పరిశీలకుల భావన.  సమయమే దీనికి సరైన సమాధానం!

పా ర్టీ  సొంత  ఆకాంక్ష,  -అంచనాలకు మించి ఉత్తర తెలంగాణలో  బీజేపీ  పదేళ్లుగా ఎదిగింది.   కరీంనగర్,  నిజామాబాద్,  ఆదిలాబాద్  మూడు లోక్​సభ స్థానాలను  వరుసగా 2019,  2024  రెండు ఎన్నికల్లో గెలవటమే కాకుండా 2023లో  తమ  మెజారిటీ  అసెంబ్లీ స్థానాలను (7/8) అక్కడే  దక్కించుకుంది.  ఎన్నికల ఫలితాల కోణంలో  చూసినపుడు  క్రమంగా  అక్కడ పార్టీ  స్థిరపడుతున్న  సూచనలు  కనిపిస్తున్నాయి. పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నా....  బలమైన  రాజకీయ కారణం,  అప్పటివరకు  అక్కడ  బలంగా  ఉన్న  బీఆర్‌ఎస్  తప్పిదాలే అన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.  

బీఆర్‌ఎస్  తెలిసి చేసిన తప్పిదాలు కొన్నయితే  వ్యూహాత్మక లోపం వల్ల జరిగిన తప్పులు  మరికొన్ని.   ఏమైతేనేం,  ఉత్తర  తెలంగాణలో  బీఆర్‌ఎస్ స్థానే  బీజేపీ  ఎదిగి,  ఒక  బలమైన  రాజకీయ శక్తిగా  స్థిరపడుతోంది.  బీజేపీకి ఈ  ప్రాంతంలో  ప్రస్తుత  ఘనమైన లోక్‌సభ (3), అసెంబ్లీ (7) ప్రాతినిధ్యానికి తోడు  రాబోయే  స్థానిక  సంస్థల  ఎన్నికల్లోనూ  మంచి ఫలితాలు  లభిస్తే  ఉత్తర తెలంగాణలో  ఇక  బీజేపీకి  తిరుగుండదు.  

స్థానికసంస్థల ఎన్నికల్లో  బలపడటమంటే పార్టీ  కిందిస్థాయి  వ్యవస్థను పటిష్టపరచుకోవడం కింద లెక్క!  తద్వారా  పెద్దసంఖ్యలో కిందిస్థాయి  ప్రజాప్రతినిధుల బలం పార్టీకి పెరుగుతుంది.  ‘పైపైన ఏం ప్రకటనలు చేసినా,  పెద్ద పెద్ద సభలు ఎన్ని నిర్వహించినా బీజేపీ సంస్థాగతంగా బలపడటం లేదనే విమర్శ ఒకటుంది. దాన్ని తిప్పికొట్టడానికి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఇదొక చక్కని అవకాశమే అవుతుంది.

బీఆర్‌ఎస్ బలహీనపడింది

దశాబ్ద కాలానికి పైగా ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ ఒక బలమైన రాజకీయ శక్తి.  తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించడానికి  చాలాముందు.. ఉద్యమపార్టీగా ఉన్నపుడే నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్‌లను గెలుచుకొని  రికార్డు సృష్టించింది.  పార్టీ  ముఖ్య నాయకులైన వారంతా ఈ ప్రాంతం నుంచే ఉండటం వల్ల ఉద్యమ రోజుల్లోనే  గట్టి  పునాదులతో  బీఆర్‌ఎస్  ఇక్కడ రాజకీయంగా ఎదిగింది.  ఒకప్పుడు  ఇక్కడ్నుంచే రాష్ట్ర రాజకీయాల్ని పార్టీ శాసించింది.   

ఉద్యమంపై  నిబద్ధత  చాటడానికి  ‘ఊ...’  అంటే  చట్టసభ  పదవులకు  రాజీనామాలు చేసి,  తిరిగి ఎన్నికల్లో  పోటీచేసి  గెలవడానికి  బీఆర్‌ఎస్‌కు  ధీమా  ఇచ్చిన  నేల ఉత్తర తెలంగాణ. అటువంటిది  ఇప్పుడు  పార్టీ  ఎదురీదుతోంది.  పలుచోట్ల గట్టి  ప్రత్యర్థుల్ని,  ముఖ్యంగా బీజేపీని  ఎదుర్కోవాల్సి వస్తోంది.  రేపటి  కార్పొరేషన్  ఎన్నికల్లో  అదే  నిజామాబాద్,  కరీంనగర్​లను,  కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు  బీజేపీ  ముమ్మరంగా  యత్నిస్తోంది.  నిజామాబాద్,  కరీంనగర్‌తోపాటు  ఆదిలాబాద్  లోక్‌సభ స్థానాలను  2 019 లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీ  గెలవటమే  కాకుండా  తిరిగి 2024 ఎన్నికల్లో  నిలబెట్టుకుంది. 

బీఆర్ఎస్​ ఎదురీత

2023 అసెంబ్లీ  ఎన్నికల్లో  ఇదే  ఉత్తర  తెలంగాణ నుంచి నిజామాబాద్ (అర్బన్),  కామారెడ్డి,  ఆర్మూర్,  నిర్మల్,  ఆదిలాబాద్,  ముథోల్,  సిర్పూర్ స్థానాల్లో  బీజేపీ  అభ్యర్థులు  గెలిచారు.  ఒక్క  గోషామహల్ తప్ప,  పార్టీ గెలిచిన మొత్తం  ఎనిమిదింట  ఏడు స్థానాలు  ఇక్కడే  లభించాయి.   ఇప్పుడు  స్థానిక  ఎన్నికల్లో  వారంతా  క్రియాశీలకంగా  పనిచేస్తున్నారు.  పాలకపక్షం  కాంగ్రెస్,  ఎదుగుతున్న  బీజేపీలతోనే  కాకుండా కొన్నిచోట్ల మజ్లిస్ (ఎం.ఎం.ఎం) కంటే కూడా  బీఆర్ఎస్  వెనుకబాటులో  ఉంది.   

మున్సిపల్- కార్పొరేషన్  ఎన్నికల్లో  బీఆర్ఎస్  మూడు,  నాలుగు  స్థానాలకు దిగజారిపోతే,  అటుపై  వచ్చే  ఎంపీటీసీ,  -జడ్పీటీసీ ఎన్నికల్లో  వారికి  మరింత  ఎదురీత  తప్పదు. సైద్ధాంతికంగా,  రాజకీయంగా  బీఆర్ఎస్  బలహీనపడటం  ఎన్నో  విపరిణామాలకు  దారితీస్తోంది.  నక్సల్బరి  ప్రేరణతో సాగిన ‘జగిత్యాల పోరు’ నుంచి  పీపుల్స్​వార్,  మావోయిస్ట్  పార్టీల్లో  కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగిన మహా మహా నక్సలైట్ నాయకులను అందించిన పోరాటాల గడ్డ ఉత్తర తెలంగాణ ఇవాళ ‘హిందూత్వ’ రాజకీయ ప్రయోగశాల కావడమే చారిత్రక వైచిత్రి!

‘హిందూత్వ’ బలపడటం వెనుక...

బీజేపీ ఉత్తర  తెలంగాణను  తన ‘ప్రయోగశాల’గా  మలచుకోవడం వెనుక విభిన్న కారణాలున్నాయి.  ‘హిందూత్వ’వాదం  అప్పటికే  బలంగా ఉన్న మహారాష్ట్రతో  ఉత్తర  తెలంగాణకు  భౌతిక‌, -సాంస్కృతిక‌  సరిహద్దులున్నాయి. భైంసా,  నిజామాబాద్,  బోధన్,   నిర్మల్ వంటి చోట్ల  అప్పటికే  ఉన్న  హిందూ,  -ముస్లిం  వైషమ్యాలు  అందరికీ తెలిసినవే!    బీఆర్ఎస్  అనుసరించిన  రాజకీయ, రాజకీయేతర  వైఖరి కూడా  బీజేపీ ఎదుగుదలకు  దోహదపడింది. 

బీఆర్ఎస్  అధినేత  కల్వకుంట్ల  చంద్రశేఖరరావు  ఎన్ని  యజ్ఞాలు,  యాగాలు చేసినా...‘హిందూత్వ’వాదులు దాన్ని  ఆధ్యాత్మిక దృ ష్టితోనే తప్ప మత దృ ష్టితో చూడలేదు.  పైగా, 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ‘హిందూగాళ్లు  బందూగాళ్లు’ అంటూ  కేసీఆర్  చేసిన  వ్యాఖ్యల్ని  హిందూత్వవాదులు  తీవ్రంగా  పరిగణించారు.  బీజేపీ  ఎంపీలైన  కేంద్ర మంత్రి బండి సంజయ్ (కరీంనగర్),  అరవింద్ (నిజామాబాద్) అచ్చంగా ‘హిందూత్వ’ దృక్పథాన్నే చాటుతుంటారు. బలహీన వర్గాల్లో  రాజకీయంగా  బలమైన  మున్నూరు  కాపు సామాజిక వర్గానికి  వీరిద్దరూ  ప్రాతినిధ్యం  వహిస్తారు. 

హిందూ పోలరైజేషన్​

బండి సంజయ్  ఏటా  ‘హిందూత్వ ఏకతా యాత్ర’  నిర్వహిస్తారు.  ఎప్పటికైనా నిజామాబాద్  పేరును  ‘ఇందూర’గా  మారుస్తామని  ఒకరంటే,  కరీంనగర్  పేరును ‘కరినగరం’గా  మారుస్తామని మరొకరంటారు.  వారిద్దరు  నాయకులు  ముస్లింలను  రెచ్చగొట్టే విధంగా  చేసే  వ్యాఖ్యలు,  ప్రసంగాలు  ఆయా వర్గాలను  రాజకీయ  పునరేకీకరణలవైపు  నెడుతున్నాయి.  బీజేపీని  ఓడించేంత  బలంగా  కనిపించినపుడు బీఆర్ఎస్‌కు  దన్నుగా ఉన్న ముస్లింలు,  అదే  బీఆర్ఎస్  బలహీనపడ్డపుడు  క్రమంగా  కాంగ్రెస్ వైపు  మొగ్గడం మొదలైంది. 

ముస్లింలు  కాంగ్రెస్ వైపు  మొగ్గడానికి  బీజేపీ  నేతల  రెచ్చగొట్టే  ప్రసంగాలు,  వ్యాఖ్యలు  కారణమయినట్టే  బీఆర్ఎస్  బలహీనపడటం  హిందూ ఓటు  బీజేపీ  వెనుక  స్థిరపడటానికి కారణమయింది. మొత్తంమ్మీద బీఆర్ఎస్ అనూహ్యంగా  బలహీనపడింది. ఇది రాజకీయంగా ఎదుగుదలకు బీజేపీకి ఉపయోగపడింది.

ముంచిన ముక్కోణపు ఆశ

రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప  హత్యలుండవంటారు.  రాష్ట్రంలో  బీజేపీ  ఎదుగుదలను  కొంచెం  అనుమతిస్తే  ఆ మేర  కాంగ్రెస్  అవకాశాలు తగ్గి, ముక్కోణపు  పోటీ  ఏర్పడుతుంది,  అప్పుడు ‘మూడింట మెరుగయిన  ముక్క తానే  అవుతాను  గనుక  గెలుపు తేలిక’  అనుకుంది  బీఆర్ఎస్!  ఆ క్రమంలోనే  బీఆర్ఎస్  రాష్ట్రంలో  బీజేపీతో  లోపాయికారిగా  పనిచేస్తోందనే విమర్శ వచ్చింది.  అలా ముస్లింలు దూరమయ్యారు.  ఆ భావన  ప్రజల్లోకి బలంగా వెళ్లటం వల్లే 2024  లోక్‌సభ  ఎన్నికల్లో  పార్టీకి  ‘జీరో’ దక్కింది. 

దుబ్బాక,   హూజూరాబాద్  అసెంబ్లీ  ఎన్నికలు,  జీహెచ్‌ఎంసీ  ఎన్నికల  ఫలితాలతోనే  బీఆర్ఎస్ అప్రమత్తం కావాల్సింది.  బీజేపీని  గట్టిగా ప్రతిఘటించకపోవడమే  విరుద్ధ  సంకేతాల్ని పంపింది.  బీజేపీలో  బీఆర్ఎస్ విలీన  ప్రతిపాదనను  తానే  అడ్డుకున్నానంటూ  కేసీఆర్  కూతురు  కవిత  ఇటీవల చేసిన  వ్యాఖ్య  దాన్ని ధృవీకరించింది.  అటు ముస్లింలకు,  ఇటు హిందూవులకూ  దూరమైన  పార్టీ స్థితి  ‘రెంటికి చెడ్డ రేవడి’  అయింది.   కనీసం   కమ్యూనిస్టులతోనైనా  సఖ్యత ఉంటే  బీఆర్ఎస్‌కి  ఎంతో కొంత  లాభించేది.  

వారివల్ల  మునుగోడు  ఉప ఎన్నికలో లబ్ధి పొంది  కూడా తర్వాత వారిని దూరం  చేసుకున్నారు.  నిన్నటి  పంచాయతీ  ఎన్నికల్లో  గుడ్డిలో మెల్లలా  అక్కడక్కడా  పార్టీ   వెలిగిందంటే  స్థానిక నాయకత్వమే కారణం.  బడా నాయకత్వం ఇచ్చిన స్ఫూర్తి  సున్నా.   బీజేపీ  ఉత్తర  తెలంగాణ  ప్రయోగం, ముఖ్యంగా  ‘హిందూత్వ కార్డ్‌’  దక్షిణ  తెలంగాణలో   పనిచేస్తుందా?  అన్నది  కోటిరూకల ప్రశ్న!  వేర్వేరు  కారణాలతో  బీజేపీ  దక్షిణ  తెలంగాణను  కూడా  కమ్మేయక ముందే  మేలుకోకుంటే  బీఆర్ఎస్‌కు  మున్ముందు కష్టకాలమే!

-దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్