మీ లెక్క ఆయన దొంగ దీక్షలు చేయలేదు

మీ లెక్క ఆయన దొంగ దీక్షలు చేయలేదు

బీఆర్ఎస్​ అంటే బార్ అండ్​ రెస్టారెంట్ పార్టీ అని కామెంట్

మెదక్(చిన్నశంకరంపేట), వెలుగు: సీఎం కేసీఆర్ తనను తాను మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. గాంధీ ఎప్పుడూ దొంగ దీక్షలు చేయలేదని, దొంగ దీక్షలు చేసిన వాళ్లు ఈ రోజు మహాత్ముడితో పోల్చుకుంటున్నారని కేసీఆర్​ను ఉద్దేశించి కామెంట్​ చేశారు. గాంధీజీ నిస్వార్థపరుడైతే.. కేసీఆర్​ స్వార్థపరుడని, ఆయన నీతిమంతుడైతే ఈయన అవినీతిపరుడని ఆరోపించారు. కేసీఆర్ కు గాంధీ పేరు చెప్పే అర్హత కూడా లేదన్నారు. సోమవారం మెదక్, చిన్నశంకరంపేట మండలాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో మహిళలతో కలిసి షర్మిల బతుకమ్మ ఆడారు. అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలు కొట్లాడితే, లక్షలాది మంది ఆస్తులు త్యాగం చేస్తే, వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందని, కానీ కేసీఆర్ రాష్ట్రం తానే తెచ్చానని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కరైనా లాఠీ దెబ్బలు తిన్నారా? ఆస్తులు త్యాగం చేశారా? ఆత్మ బలిదానాలు చేశారా? అని ప్రశ్నించారు. దొంగ దీక్షలు చేసి.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచిపోయిన వీళ్లా తెలంగాణ తెచ్చిందని ఫైర్​ అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్నికేసీఆర్​ కుటుంబం క్యాష్ చేసుకుందని ఆరోపించారు. కేసీఆర్​ చెప్పిన ప్రతి మాటా అబద్ధమని, ఆయన అన్ని వర్గాలనూ మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడ చాలదన్నట్టు ఇప్పుడు దేశాన్ని ఏలడానికి వెళ్తారట, అందుకోసం బీఆర్ఎస్​ పార్టీ పెడతారట, బీఆర్ఎస్​ అంటే బార్​ అండ్​ రెస్టారెంట్​ పార్టీ అని షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు చనిపోతుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టింపులేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారట అని అన్నారు.