ODI Cricket Dying: టీ20 క్రికెట్ ఆధిపత్యం పెరుగుతున్న తరుణంలో వన్డే ఫార్మాట్ మనుగడపై తరచూగా చర్చలు జరుగుతునే ఉన్నాయి. వన్డే క్రికెట్ బతకాలంటే శ్వాస వదలడమే తరువాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వన్డే ప్రపంచ కప్ నిర్వహించడం ఎందుకు అవసరమా? అనే ప్రశ్నపై వెస్టిండీస్ లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా (Brian Lara) కేప్ టౌన్‌లో జరిగిన కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చాడు. 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఆవిష్కరణ సందర్భంగా లారా వన్డే ఫార్మాట్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
రైడర్ కప్‌తో వన్డే ప్రపంచ కప్‌ను పోల్చిన బ్రియాన్ లారా:
బ్రియాన్ లారా మాట్లాడుతూ.. ప్రపంచ కప్ చాలా ముఖ్యం.. టీ20 క్రికెట్ రాకతో 50 ఓవర్ల గేమ్‌పై కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే నేను దీన్ని గోల్ఫ్‌లోని రైడర్ కప్ లాగా చూస్తాను.. గోల్ఫ్‌లో రెండేళ్లకు ఒకసారి మినహా ఎవరూ టీమ్ గోల్ఫ్ ఆడరు.. టెస్ట్ క్రికెట్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉంది, అలాగే టీ20 అందరి మనసులను దోచుకుంది. కాబట్టి సమస్య ఏంటో నాకు అర్థమవుతుంది. వన్డే క్రికెట్ అనేది డబ్ల్యూటీసీ (WTC), టీ20 వరల్డ్ కప్ మధ్య నలిగిపోతున్నప్పటికీ, ఇది ఆటలో అత్యంత కీలకమైన వెర్షన్. ద్వైపాక్షిక వన్డేలను పరిమితం చేయవచ్చు కానీ, ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి ప్రపంచ కప్ నిర్వహించడం మాత్రం కచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు.
బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో సవాళ్లు:
ఆర్థిక వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి.. ప్రపంచ కప్‌లు భారీగా లాభాలను తెచ్చిపెట్టడమే దీనికి ప్రధాన కారణం అని బ్రియాన్ లారా పేర్కొన్నారు. 2023 ప్రపంచ కప్ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించగా, వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 టోర్నమెంట్ 1.5 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో కొంత అనిశ్చితి నెలకొంది. భారతదేశంలో హక్కులు కలిగిన జియోస్టార్ (JioStar) లాంటి సంస్థలు భారీ హక్కుల ఫీజులు, ప్రకటనల ఆదాయం మందగించడంతో నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ప్రసార హక్కుల విలువ 30 శాతం నుండి 50 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా. దేశీయ బోర్డులు ఫ్రాంచైజీ టీ20 టోర్నమెంట్ల ద్వారా ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, క్యాలెండర్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. మరి ఈ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా వన్డేలు తగ్గిపోతాయా? 2027 వరల్డ్ కప్ చివరకు ఆఖరిది అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మధుర జ్ఞాపకాలు:
ట్రోఫీకి ఉన్న సుదీర్ఘ చరిత్ర పరంగా చూస్తే వన్డే ప్రపంచ కప్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. బ్రియాన్ లారా తన కెరీర్‌లో దక్షిణాఫ్రికాపై రెండు చిరస్మరణీయ శతకాలను వరల్డ్ కప్‌లోనే సాధించారు. 1996 కరాచీ క్వార్టర్ ఫైనల్‌లో 94 బంతుల్లో 111 పరుగులు చేసి వెస్టిండీస్‌ను గెలిపించడం, అలాగే 2003 టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో నెల్సన్ మండేలా సమక్షంలో కేప్‌టౌన్‌లో 116 పరుగులు చేయడం తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాలని లారా గుర్తు చేసుకున్నారు.
రగ్బీ వరల్డ్ కప్‌తో పోటీ:
2027 క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగే రగ్బీ వరల్డ్ కప్ కాలంతోనే కలిసి ప్రారంభం కానుంది. కానీ దీనివల్ల వ్యూవర్షిప్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని టోర్నమెంట్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ట్రెవర్ మాన్యువల్ స్పష్టం చేశారు. భారత ఉపఖండంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రపంచంలో రెండవ అత్యధికంగా అనుసరించే క్రీడగా క్రికెట్ నిలుస్తుందని, భవిష్యత్తు ఎలా ఉన్నప్పటికీ క్రికెట్ మనుగడకు ఎలాంటి ముప్పు లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
