ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇది పిచ్చిమొక్కల నర్సరీనా? హరితహారం కోసం పెంచుతున్న మొక్కల స్థానంలో పిచ్చి మొక్కలు పెరగడం ఏమిటి? కనీసం గడ్డి కూడా తీయించలేరా? అని అడిషనల్​కలెక్టర్​చాహత్ బాజ్ పేయ్​ఫైర్​అయ్యారు. మంగళవారం బెజ్జూర్, కౌటాల మండలంలో ఆమె పర్యటించారు. బెజ్జుర్, కాటేపల్లిలో  విలేజీ పార్క్, నర్సరీ చూశారు. గడ్డీని చూసి ఈ జీస్ ఏపీవో బుచ్చన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు చేస్తున్న పని అంటూ పంచాయతీ సెక్రటరీని నిలదీశారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్​లో రికార్డులు పరిశీలించారు. ఏ ఒక్క రికార్డు సరిగాలేదని.. అన్ని పట్టుకొని జిల్లా కేంద్రానికి రావాలని సిబ్బందని ఆదేశించారు. 

– కాగజ్ నగర్, వెలుగు

టీజీవో అసోసియేషన్​ భవనానికి స్థలం కేటాయించాలి

ఆదిలాబాద్,వెలుగు: జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్​కు వినతిపత్రం అందజేశారు. స్థలం ఇచ్చేందుకు కలెక్టర్​సానుకూలంగా స్పందించినట్లు లీడర్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ శ్యాంనాయక్, జనరల్ సెక్రటరీ వనజారెడ్డి, సహా అధ్యక్షుడు శివకుమార్, మెంబర్స్ భిక్షపతి గౌడ్, డీఎల్పీవో శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అరుణ, ఎంపీవో మహేశ్​ కుమార్, డీపీఆర్వో భీమ్ కుమార్ తదితరులు ఉన్నారు.

వచ్చేది కాంగ్రెస్​ సర్కారే

భైంసా,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని, రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే అని డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్​చెప్పారు. మంగళవారం స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్​ఫ్యాక్టరీలో కార్యకర్తల మీటింగ్​నిర్వహించారు. అంతకు ముందు భైంసాకు చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రామారావు పటేల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో విఫలమయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్నం శ్రీనివాస్, లీడర్లు అమూల్, సుదర్శన్, సాయినాథ్​తదితరులు పాల్గొన్నారు.

కుంటాలను అభివృద్ధి చేయాలి  

ఇచ్చోడ, వెలుగు: జిల్లాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల చేపట్టిన లోక్ సభ ప్రవాస్ యోజన పర్యటన ఉత్సాహంగా సాగింది. నిర్మల్ నుంచి ప్రారంభమైన యాత్ర బోథ్ నియోజకవర్గంలో ముగిసింది. మంగళవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి బయలు దేరిన మంత్రి గుడిహత్నూర్ మీదుగా ఇచ్చోడ  చేరుకున్నారు. ఇచ్చోడ లోని జనరిక్​మెడికల్ షాప్ వద్ద ఆగి మందుల గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి బజార్ హత్నూర్ పీహెచ్​సీని సందర్శించారు. కరోనా వ్యాక్సినేషన్​పై ఆరాతీశారు. అందరికీ బూస్టర్​డోస్​ అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బోథ్ మండల కేంద్రానికి చేరుకొని స్థానిక లీడర్లతో మాట్లాడి ఎంపీ సోయం బాపూరావుతో కలిసి కుంటాల జలపాతానికి వెళ్లారు. మత్స్యకారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో  మాట్లాడుతూ జిల్లాలో రమణీయమైన వాతావరణం ఉందని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్, కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెంట ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు.

ఇద్దరు మోటారు దొంగల అరెస్ట్

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మండలంలో విద్యుత్ మోటార్లు ఎత్తుకెళ్లిన ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ అజయ్ బాబు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన  ఆరునాయక్ , ఇంకీర్తి శ్రీనివాస్ కొంతకాలంగా ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్లు, రైతుల విద్యుత్ మోటార్లు ఎత్తుకెళ్లి పట్టణంలోని  స్క్రాప్ దుకాణాల్లో అమ్ముతున్నారు. మంగళవారం ఇంద్రానగర్ వద్ద గల  కడమంచి లచ్చన్న దుకాణంలో మోటార్లు అమ్మతుండగా పోలీసులు దుకాణంపై దాడిచేసి  నిందితులను పట్టుకున్నట్లు సీఐ వివరించారు. వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దొంగలను చాకచక్యంగా  పట్టుకున్న ఎస్సై రజనీకాంత్, కానిస్టేబుల్ ఊశన్న, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ ను సీఐ అభినందించారు. 

బడుగుల కష్టంతోనే అగ్రవర్ణాలకు సంపద

ఆసిఫాబాద్,వెలుగు: బడుగుల కష్టంతోనే అగ్రవర్ణాలు సంపద సృష్టిచుకుంటున్నారని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆరోపించారు. భవిష్యత్తులో ఓటు అమ్ముకునే వారికి, ఓటు కొనేవారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పేదల రాజ్యం వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ, మోతుగూడా గ్రామాల్లో స్వరాజ్య పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ జ్ఞాన వారసుడిగా పది వేల కిలో మీటర్ల స్వరాజ్య  పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజల గుండెల్లో అంబేద్కర్, కాన్షీరాం భావాలు నింపుతామన్నారు. యాత్రలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా ఇన్​చార్జి వంశీ, జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్, వెంకటేశ్, నరేశ్, సంతోష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

‘భైంసా బల్దియాలో అక్రమాలు’

భైంసా,వెలుగు: భైంసా మున్సిపాల్టీలో అంతా అవినీతే జరుగుతోందని బీజేపీ కౌన్సిలర్లు కపిల్ సింధే, దశరథ్​ ఆరోపించారు. మంగళవారం మున్సిపాల్టీ మీటింగ్​కు హాజరై తర్వాత మీడియాతో మాట్లాడారు. టౌన్​లో చాలా వరకు వెంచర్లు ఏర్పాడ్డాయని, వాటికి ఎలా పర్మిషన్​ ఇస్తున్నారని ప్రశ్నించారు. విచ్చల విడిగా బిల్డింగ్​లకు పర్మిషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. జరుగుతున్న పనుల వివరాలు ఇవ్వాలనిఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నా ఆఫీసర్లు స్పందించడంలేదన్నారు. రెండు నెలల క్రితం మల్టిపర్పస్ ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చారన్నారు. అనుమతులు లేని ఇండ్లకు హౌజ్​ నంబర్లు కేటాయిస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారి వెంట  పోశెట్టి, దిలీప్, రామకృష్ణ ఉన్నారు.

పోన్కల్​ను మండలం చేయాలె

నిర్మల్, వెలుగు: నిర్మల్​జిల్లా మామడ మండలంలోని పోన్కల్​ గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించాలని కోరుతూ పది గ్రామాల ప్రజలు మంగళవారం ఆందోళనకు దిగారు. న్యూసాంగ్వి క్రాస్​రోడ్డు వద్ద వంటావార్పు నిర్వహించారు. దాదాపు పది గ్రామాల ప్రజలు నిర్మల్​– -మంచిర్యాల రోడ్డుపై నాలుగు గంటలపాటు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 3 వేల మంది రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు. పోన్కల్​ను మండల కేంద్రంగా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. మండలం ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. 

35 శాతం వాటా ఇవ్వాలి

బెల్లంపల్లి,వెలుగు: సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్​చేశారు. మంగళవారం బెల్లంపల్లి శాంతిఖని బొగ్గుగని ఆవరణలో నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ, కాంట్రాటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మీటింగ్ లో ఏఐటీయూసీ బ్రాంచ్ ఇన్ చార్జి చిప్ప నర్సయ్య, కార్యదర్శి  దాగం మల్లేష్, సీపీఐ పట్టణ కార్యదర్శి డి.ఆర్. శ్రీధర్, ప్రచార కార్యదర్శి బొంకూరి రాం చందర్, లీడర్లు ఎల్తూరి శంకర్, రంగ ప్రశాంత్, బియ్యాల ఉపేందర్, కె.అశోక్, బి. ప్రశాంత్, రామ్ కొమురయ్య, మంతెన రమేశ్, మంతెన భాస్కర్, కె. అన్వేశ్​కుమార్, రామస్వామి, సురేశ్, బి. రాజన్న, ఎండీ అనుజ్ కాన్, శ్రీను, రమణ పాల్గొన్నారు.

వేలానికి రాజీవ్​ స్వగృహ ప్లాట్లు రెడీ

ఆదిలాబాద్, వెలుగు: మావల మండలం బట్టి సవర్గాం పరిధిలో 28.37 ఎకరాల్లోని రాజీవ్ సృగృహ ప్లాట్ల బహిరంగవేలానికి చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన రాజీవ్ సృగృహ లే ఔట్లను పరిశీలించారు. వేలం కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 362 ప్లాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్నల్​వర్క్స్​మరో పది రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, మావల తహసీల్దార్ వనజా రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి కిరణ్, మున్సిపల్ డిప్యూటీ ఈఈ తిరుపతి ఉన్నారు.

అరెస్టులు, గృహ నిర్బంధాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా చేయాలని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై దాడి, అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. పలుచోట్ల ప్రభుత్వం, సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా పలువురు లీడర్లను ఉదయమే హౌస్​ అరెస్ట్​ చేశారు.  బీజేపీ, బీజేవైఎం లీడర్ల అరెస్టులను పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షడు వెరబెల్లి రఘునాథ్​రావు ఖండించారు. కార్యకర్తల ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. అవినీతిని ప్రశ్నించిన నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి అణిచివేయాలని చూస్తోందని బీజేవైఎం అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు విమర్శించారు.  
బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు.– వెలుగు నెట్​వర్క్

ఇయ్యాల్టి నుంచి పాపహరేశ్వర యాత్ర

నిర్మల్,వెలుగు: సాయి దీక్ష సేవాసమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏటా చేపట్టే కదిలి పాపహరేశ్వర మహా పాదయాత్ర బుధవారం స్థానిక గండి రామన్న ఆలయం నుంచి ప్రారంభంకానుంది. కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లక్కడి జగన్మోహన్​ రెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం ఆరు సంవత్సరాలుగా కదిలి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

రాంపూర్​ పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

జన్నారం,వెలుగు: మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ గంగారాంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ భారతీహోళికెరి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 20న హరితహారం మొక్కల విషయంలో సర్పంచ్ అల్గనూరి సులోచన, ఆమె భర్త రవితో పంచాయతీ ఆఫీస్ లో సెక్రటరీ గంగారాం, సర్పంచ్ భర్త రవి పరస్పర దాడిచేసుకున్నారు. అదే రోజు సెక్రటరీ గంగారాంపై జన్నారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ కేసు నమోదైంది. ఘటనపై ఎంపీడీవో విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్​ సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్​ చేయాలి

భైంసా,వెలుగు: లిక్కర్​స్కామ్​తో సంబంధం ఉన్న సీఎం కేసీఆర్​తనయ ఎమ్మెల్సీ కవితను వెంటనే పదవీ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్ డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లో కవిత ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా మోర్చా లీడర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం భైంసాలోని దారాబ్జీ ఫ్యాక్టరీలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. లిక్కర్ మాఫియాతో ఎమ్మెల్సీ కవిత చేతులు కలపడం సిగ్గుచేటన్నారు. స్కామ్​తో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఫైర్​అయ్యారు. నిరసనలో కౌన్సిలర్ కపిల్ సింధే, లీడర్లు సుభాష్ పటేల్, తాడేవార్​ సాయినాథ్, దిలీప్, రామకృష్ణ, మాణిక్ దగ్డే, సంజీవ్ పటేల్​ తదితరులు పాల్గొన్నారు.

కవితపై చర్యలు తీసుకోవాలి...

నిర్మల్,వెలుగు: లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న ఎమ్మెల్సీ కవితను పదవీ నుంచి బర్తరఫ్​చేయాలని బీజేపీ లీడర్, మున్సిపల్ మాజీ చైర్మన్​ అప్పాల గణేశ్​చక్రవర్తి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు డిమాండ్​చేశారు. మంగళవారం వారు స్థానికంగా మీడియాతో మాట్లాడారు. కవిత ఇంటి ఎదుట మహిళా మోర్చా లీడర్లు ఆందోళనలు చేస్తే పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాదయాత్రను భగ్నం చేసి పోలీస్ స్టేషన్​కు తరలించడం హేయమైన చర్యన్నారు.