రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి, భద్రత, దేశాల మధ్య స్నేహ సంబంధాలను నెలకొల్పడానికి యునైటెడ్ నేషన్స్ను 1945లో ఏర్పాటు చేసుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే యూఎన్ విధివిధానాలను మార్చవలసిన సమయం వచ్చిందని అర్థమవుతోంది. కొన్ని రోజులుగా ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్లో యూఎన్ ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉండటమే దీనికి కారణం. ముఖ్యంగా ఇండియా–చైనా మధ్య ఉద్రిక్తతల సమయంలో, తైవాన్–చైనా సంఘర్షణలో, అర్మేనియా-అజర్బైజన్ గొడవ, అఫ్గానిస్తాన్–తాలిబాన్ వార్లో, తాజాగా రష్యా–ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ వైఖరి సరిగ్గా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యూఎన్, భద్రతా మండలి, వీటో అధికారంలో మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే నానాజాతి సమితి విఫలం కావడం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితుల దృష్ట్యా యూఎన్ భద్రతా మండలిలో కొన్ని దేశాలకు(యూఎస్, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా) శాశ్వత సభ్యత్వంతో పాటు వీటో అధికారం కట్టబెట్టారు. ఆ వీటో అధికారమే ఇప్పుడున్న పరిస్థితులకు, ప్రపంచ శాంతికి, దేశాల మధ్య ఐక్యతకు అడ్డంకిగా మారింది.
గత కొన్ని సంవత్సరాలుగా భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే భద్రతా మండలికి, యూఎన్ చార్టర్ చట్టం ప్రకరణ 24, 26 ప్రకారం కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. భద్రతా మండలి నిబంధనలకు అనుగుణంగా సభ్యదేశాలు శాంతి, భద్రతను కాపాడడానికి కట్టుబడి ఉండాలి. కొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం లేకపోయినా ప్రపంచశాంతిని నిలపడానికి సహాయపడతున్నాయి. ఇందుకు ఉదాహరణ యూఎన్ పీస్ కీపింగ్ మిషన్ లో ఇండియా భాగమవడం. తాత్కాలిక సభ్యత్వాన్ని కొనసాగిస్తూనే, అర్హుత ఉన్న దేశాలకు శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం కల్పించవలిసిన అవశ్యకత ఉందని తాజా పరిస్థితులతో స్పష్టమవతోంది. అలాంటి అధికారాలను కల్పించడం ద్వారా ప్రతి దేశానికి వాటి విధివిధానాలను స్వేచ్ఛగా పంచుకునే హక్కు కల్పించినట్లవుతుంది. నానాజాతి సమితికి పట్టిన గతి యూఎన్కు పట్టకుండా ఉండాలంటే, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాలి. యూఎన్ నిర్మాణం లోపభూయిష్టంగా, దేశాల భాగస్వామ్యం తక్కువగా ఉందనేది నిజం. అందువల్ల భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించటానికి, పరిష్కరించటానికి, దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి ఇకనైనా యూఎన్ మౌనం వీడి ప్రపంచ శాంతి దిశగా అడుగు ముందుకు వేయాలి.
- పుట్టి నరేష్, రామాయంపేట, మెదక్ జిల్లా
