కర్నాటక నుంచి నీళ్లు సముద్రంలో ఏడ కలుస్తున్నయ్​?

 కర్నాటక నుంచి నీళ్లు సముద్రంలో ఏడ కలుస్తున్నయ్​?
  • ఆలమట్టి ఎత్తు పెంపు కేసులో సుప్రీంలో తెలంగాణ వాదన

న్యూఢిల్లీ, వెలుగు: కర్నాటక నుంచి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయన్న ఆ రాష్ట్ర వాదనపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకే నీళ్లు రానప్పుడు సముద్రంలోకి ఎలా కలుస్తాయని ప్రభుత్వ తరఫు సీనియర్​ లాయర్​ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. కర్నాటక లో కృష్ణా నది నుంచి సముద్రం చాలా దూరంలో ఉందని, మరి అలాంటప్పుడు నీరు సముద్రంలో కలుస్తుందని క్లారిటీ లేకుండా ఎలా చెప్తారన్నారు.

ఆలమట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపుకు కృష్ణా ట్రిబ్యునల్-–2 ఇచ్చిన అవార్డును సవాల్ చేస్తూ 2014 లో ఉమ్మడి ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ బ్రిజేశ్​ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును కేంద్రం అమలు చేయాలని కర్నాటక ప్రభుత్వం ఇంటర్ కేటరీ అఫికేషన్ (ఐఏ) వేసింది. ఈ ఐఏను సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్​ విచారించింది. 2007 నుంచి ఎగువ రాష్ట్రాలు ఎంత నీరు వాడాయో, ఎంత మళ్లించాయో లెక్కలు తేలాల్సి ఉందని వైద్యనాథన్  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ లెక్కలు తేలే వరకు ఈ ఐఏను విచారించడం సబబుకాదని విన్నవించారు. తర్వాత కేంద్రం,  కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్నాక విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది.