శ్రీశైలం ఆలయానికి ఐఎస్ఐ గుడ్ హైజనిక్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్

శ్రీశైలం ఆలయానికి ఐఎస్ఐ గుడ్ హైజనిక్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్
  • రాష్ట్రంలో జీ హెచ్ పీ ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం 
     

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) గుర్తింపు లభించింది. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు, అలాగే స్థానికుల సౌకర్యం కోసం వైద్య ఆరోగ్యపరంగా చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు మరియు రక్షణా చర్యలకు ఐ.ఎస్.ఓ గుర్తింపుతోపాటు ఐఎస్ఓ – 45001 కూడా లభించింది. అదేవిధంగా క్షేత్ర పరిధిలో పారిశుధ్య నిర్వహణ, కోవిడ్ నిబంధనలు బాగా అమలు చేసినందుకు జీహెచ్ పీ (గుడ్ హైజనిక్ ప్రాక్టీసెస్) ధ్రువీకరణ కూడా లభించింది. ఈ ధృవీకరణలను అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ (హెచ్ వై ఎం) శ్రీశైలం దేవస్థానానికి అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ధ్రువీకరణ పత్రాలను శ్రీశైలం దేవస్థానం ఈవో కె.ఎస్ రామారావుకు అందజేశారు.

రాష్ట్రంలో గుడ్ హైజెనిక్ ప్రాక్టిసెస్ (జి.హెచ్.పి) ధ్రువీకరణ పొందిన తొలి ఆలయం శ్రీశైలం దేవస్థానం కావడం విశేషం. అదేవిధంగా గతంలో 2018 సెప్టెంబరులో శ్రీశైలం దేవస్థానికి ఐదు రంగాలలో ఇచ్చిన ఐఎస్ఓ ధ్రువీకరణలు కూడా మరో మూడేళ్ల కాల పరిమితితో ధ్రువీకరించినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దేవస్థానంలో వివిధ రంగాలలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు గాను కొత్తగా రెండు విభాగాలకు సంబంధించిన ధ్రువీకరణలు,గతంలో ఇచ్చిన ఐదు ధ్రువీకరణలు పొడిగించారు. హెచ్ వై ఎం అంతర్జాతీయ ధ్రువీకరణ సంస్థ ప్రతినిధులు శ్రీశైల క్షేత్ర కార్యకలాపాలను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఈ ధ్రువీకరణలు అందజేసినట్లు దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.

గతంలో పరిపాలన విధి విధానాలకు గాను ఐఎస్ఓ – 9001, ఉద్యాన వనాలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణ చర్యలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ 14001 గుర్తింపు, అన్నదానం, ప్రసాదాల తయారీలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు ఫుడ్ సేఫ్టీ ధ్రువీకరణ ఐఎస్ఓ- 22000, సౌర శక్తి, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగానికి గాను ఐఎస్ఓ -50001 ధ్రువీకరణ, అధునాతన సాఫ్ట్ వేర్ టెక్నాలజీ వాడుతున్నందుకు సెక్యూరిటీ మేనేజ్ మెంట్ ధ్రువీకరణ ఐఎస్ఓ – 27001 లు మళ్లీ పునరుద్ధరించారు.

ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ తదితరులు ఇచ్చే ఆదేశాలు, సలహా, సూచనలను ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నామని అన్నారు. దేవస్థానం సిబ్బంది కూడా చాలా వరకు బాధ్యతతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, మంచి దర్శనం చేసుకుని సంతృప్తిగా తిరిగి వెళ్లేలా చేస్తున్నందుకు గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు.