
కోల్‌కతా: గోశాలల్లోని గోవులను ఇస్కాన్ కబేళాలకు అమ్ముకుంటోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచినట్లు భావించిన సంస్థ.. గురువారం మేనకా గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టానికి సంబంధించి నోటీసు పంపింది.
“ఇస్కాన్‌పై నిరాధార ఆరోపణలు చేసినందుకు మేనకా గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్త సమాజం, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఆమె వ్యాఖ్యలకు తీవ్రంగా బాధపడ్డారు” అని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమన్ దాస్ అన్నారు. నోటీసుకు 7 రోజుల్లో జవాబివ్వకుంటే మేనకా గాంధీపై రూ.100 కోట్లకు దావా వేస్తామని స్పష్టం చేశారు.