టెహ్రాన్: ఇరాన్ భూభాగంపై గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టాలని ఆలోచిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. "ట్రంప్, నెతన్యాహు మాయమాటలు నమ్మి మీ బిడ్డలను నరకానికి పంపకండి" అంటూ అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
దురాక్రమణకు వచ్చే సైనికులు ఇరాన్ దేశం అనే మహా సముద్రంలో మునిగిపోతారని, వారి జాడ కూడా దొరకదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధ రంగంలోని వాస్తవాలను ట్రంప్, నెతన్యాహు వక్రీకరిస్తున్నారని ఐఆర్ జీసీ ఆరోపించింది. యుద్ధ ప్రభావాన్ని అమెరికాలోని గ్యాస్ స్టేషన్లలో(పెట్రోల్, డీజిల్ ధరలు హైక్), ఇరాన్ వీధుల్లో(పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు), టెల్ అవీవ్, హైఫా ఆకాశం( ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్లు) చూడాలని పేర్కొంది.
'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4'లో భాగంగా ఇరాన్ ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లోని 70కి పైగా ప్రాంతాలపై క్షిపణి దాడులు చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి 700 మిసైల్స్, 3,600 డ్రోన్‌లను అమెరికా, -ఇజ్రాయెల్ లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికాకు చెందిన 200 యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ పేర్కొంది.
మరోవైపు, అమెరికా తన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ద్వీపంపై భూతల దాడికి పెంటగాన్ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.
