గాజాలో కరెంట్, ఫుడ్, పెట్రోల్​ సప్లై బంద్

గాజాలో కరెంట్, ఫుడ్, పెట్రోల్​ సప్లై బంద్
  • హమాస్​ టెర్రరిస్టులపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్​ సైన్యం
  • బార్డర్​లోని కీలక ప్రాంతాలు తిరిగి స్వాధీనం
  • సరిహద్దుల్లో 500 మంది హమాస్ టెర్రరిస్ట్​లు
  • బందీలుగా 100కు పైగా ఇజ్రాయెల్ పౌరులు
  • బార్డర్​లోని కీలక ప్రాంతాలు తిరిగి స్వాధీనం చేసుకున్న ఐడీఎఫ్
  • గాజా చుట్టూ యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్ల మోహరింపు
హమాస్ టెర్రరిస్ట్​లు, ఇజ్రాయెల్ బలగాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైనికులతో పాటు ప్రజలను హమాస్ ట్రెరరిస్ట్​లు బంధీలుగా చేసుకున్నారు. హమాస్ టెర్రరిస్ట్​లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) రంగంలోకి దిగి గాజా సిటీ మొత్తాన్ని ఐడీఎఫ్ చుట్టుముట్టింది. కరెంట్, వాటర్, ఫుడ్​​ సప్లై ఆపేసింది.  ఇప్పటిదాకా ఇజ్రాయెల్​లో 700 మందికి పైగా చనిపోయారు. ఒక్క గాజాలోనే 500 మంది వరకు చనిపోయారని అధికారుల అంచనా. హమాస్ టెర్రరిస్ట్​ల అదుపులో కనీసం 100 మంది వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

గాజా(ఇజ్రాయెల్): హమాస్ టెర్రరిస్ట్​లు, ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకర కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సైనికులతో పాటు ప్రజలను హమాస్ ట్రెరరిస్ట్​లు బందీలుగా చేసుకున్నారు. హమాస్ టెర్రరిస్ట్​లను దీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. గాజా సిటీ మొత్తాన్ని ఐడీఎఫ్ దిగ్బంధించింది. సిటీలోకి వెళ్లే దారులను మూసివేయడంతో పాటు కరెంట్ సప్లై ఆపేసింది. 

ఫుడ్, ఫ్యూయెల్, వాటర్ సప్లై కట్ చేసింది. గాజా మొత్తాన్ని సీజ్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ యోవో గల్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. సోమవారం నుంచి సిటీ మొత్తానికి పవర్ కట్ చేశామని వివరించారు. తాము మానవ మృగాలతో యుద్ధం చేస్తున్నామని, అందుకు తగ్గట్లే తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. 

గాజాలోనే 500 మందికిపైగా మృతి

గాజా బార్డర్​లోని ఇజ్రాయెల్ నగరాలపై మళ్లీ పట్టు సాధించినట్లు ఐడీఎఫ్ అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లను కీలక ప్రాంతాల నుంచి తరిమేశామని వివరించారు. సాధారణ ప్రజల మధ్య టెర్రరిస్టులు దాక్కొని తమపై కాల్పులకు తెగబడుతున్నారని, అయినా వారిని దీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, గాజాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హమాస్ టెర్రరిస్ట్​లు దాక్కొని ఉన్నారని తెలిపారు. 

ఇప్పటిదాకా ఇజ్రాయెల్​లో 700 మందికి పైగా చనిపోయారు. ఒక్క గాజాలోనే 500 మంది వరకు చనిపోయారని అధికారులు అంచనా వేశారు. హమాస్ టెర్రరిస్ట్​ల అదుపులో కనీసం 100 మంది వరకు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గాజాలో 500 మంది వరకు హమాస్ టెర్రరిస్టులు ఉన్నారు. గాజా చుట్టూ యుద్ధ ట్యాంకులను మోహరించారు. వీటికి రక్షణగా హెలికాప్టర్లు, డ్రోన్లు తిరుగుతున్నాయి.

ఫ్యామిలీకి ఫోన్ చేసిన కేరళ నర్సు..

ఇజ్రాయెల్​లో నర్సు​గా పనిచేస్తున్న కేరళకు చెందిన 41 ఏండ్ల షీజా ఆనంద్ తీవ్రంగా గాయపడింది. తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఇండియాలో ఉంటున్న తన భర్తతో శనివారం తెల్లవారుజామున వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడే హమాస్ టెర్రరిస్ట్​లు దాడులకు తెగబడ్డారు. షీజా ఆనంద్ ఏడేండ్లుగా ఇజ్రాయెల్​లో నర్సుగా పనిచేస్తోంది. భర్తతో మాట్లాడుతున్నప్పుడే పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఫోన్ డిస్​కనెక్ట్​ అయింది. 

టెర్రరిస్ట్​ల దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు తిరిగి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఆదివారం మధ్యాహ్నం షిజా ఫ్యామిలీకి ఆమె కొలిగ్స్ ఫోన్ చేసి విషయం చెప్పారు. మిలిటెంట్ల దాడిలో షీజా తీవ్రంగా గాయపడటంతో ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్​కు తరలించినట్లు తెలిపారు. ఫోన్ కూడా పోయిందని వివరించారు. హెల్త్ కండీషన్ స్టేబుల్​గానే ఉందని, గాయం నుంచి షీజా కోలుకుంటున్నదని చెప్పారు. మరోవైపు, కేరళకు చెందిన 200 మందికి పైగా బెత్లెహేమ్​లోని ఓ హోటల్లో చిక్కుకుపోయారు. 

తాము సేఫ్ గానే ఉన్నామని బంధువులకు సమాచారం అందించారు. ప్రార్థనలకు హాజరవుతున్న టైమ్​లోనే వైమానిక దాడుల సైరన్లు వినిపించాయని బృందంలోని సభ్యుల్లో ఒకరు చెప్పారు. వీళ్లంతా త్వరలో ఈజిప్ట్ మీదుగా ఇండియాకు చేరుకునే అవకాశాలున్నాయి. కొచ్చికి చెందిన 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్​లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్​లోని ఇండియన్ ఎంబసీ అధికారులు.. కేరళ సీఎం పినరయి విజయన్​కు అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు విచారిస్తున్నారు.

హమాస్ కథ ముగించండి: నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి

ఇజ్రాయెల్​పై హమాస్ టెర్రరిస్ట్​ల దాడిని అమెరికన్ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఖండించారు. అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటుందని, హమాస్ టెర్రరిస్ట్​ల కథ ముగించాలని ఇజ్రాయెల్​కు సూచించారు. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ సంబరాలు చేసుకున్నదని నిక్కీ హేలీ ఆరోపించారు. అమెరికా కూడా నాశనం కావాలని కోరుకుంటోందన్నారు. ఇది ఇజ్రాయెల్​పై కాదు.. అమెరికాపై అటాక్​గానే భావించాలని సూచించారు. 

ఇజ్రాయెల్​పై దాడిని అమెరికా మేలుకొలుపుగా భావించాలని వివేక్​ రామస్వామి అన్నారు. ఇలాంటి దాడి భవిష్యత్తులో అమెరికాపై కూడా జరగొచ్చని తెలిపారు. దేశ సరిహద్దులను పటిష్టం చేసుకోవాలన్నారు.  అంతర్గత వ్యవహారాలపై ఫోకస్ పెట్టాలని బైడెన్ ప్రభుత్వానికి వివేక్ రామస్వామి సూచించారు.