మేం పాక్ను నమ్మం!..అమెరికా కూడా మధ్యవర్తిగానే చూస్తోంది: ఇజ్రాయెల్

మేం పాక్ను నమ్మం!..అమెరికా కూడా మధ్యవర్తిగానే చూస్తోంది: ఇజ్రాయెల్

న్యూఢిల్లీ: ఇస్లామాబాద్‌‌‌‌లో అమెరికా, -ఇరాన్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు ముందు, భారత్‌‌‌‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ పాకిస్తాన్ పట్ల తీవ్ర అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ దేశాన్ని ఇజ్రాయెల్ నమ్మదని, అమెరికా కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంటూ ఈ ప్రక్రియలో పాకిస్తాన్ పాత్రను కేవలం లాజిస్టికల్ సదుపాయంగా మాత్రమే పరిగణిస్తోందన్నారు. 

గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. "మేము పాకిస్తానీయులను నమ్మము. అమెరికన్లు వారిని నమ్ముతున్నారని మీరు అతిగా ఉత్సాహపడకండి. అది కేవలం ఒక సమన్వయ పాత్ర మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు" అని అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్ పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. ఇజ్రాయెల్ "ఆశలు" అమెరికాపైనే ఉన్నాయని, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి అమెరికన్లు ఈ రెండు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

లెబనాన్‌‌‌‌పై ఇజ్రాయెల్ దాడులను పాకిస్తాన్ ఖండించడంపై అజర్ స్పందిస్తూ.. దేశ రక్షణ కోసం ఇజ్రాయెల్ ఏమి చేయాలో అది చేస్తూనే ఉంటుందని తెలిపారు. కాగా, గాజాలో అంతర్జాతీయ స్థిరీకరణ దళంగా పాకిస్తాన్ సైన్యం పనిచేయడం ఇజ్రాయెల్‌‌‌‌కు ఇష్టం లేదని అజార్ గతంలో చెప్పారు. హమాస్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.