గాజాలో 1,300 బిల్డింగులు నేలమట్టం

గాజాలో 1,300 బిల్డింగులు నేలమట్టం
  • గాజాలో 1,300 బిల్డింగులు నేలమట్టం
  • 2,215కు పెరిగిన మృతుల సంఖ్య
  • 4 లక్షల మంది నిరాశ్రయులు
  • ఇది ప్రారంభమే: నెతన్యాహు

జెరూసలెం/జెనీవా : హమాస్ మిలిటెంట్ల దాడులకు ప్రతీకారంగా గాజాలోని టార్గెట్లపై ఇజ్రాయెల్ బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో గాజా సిటీ శిథిలాల కుప్పగా మారిపోతోంది. ఇజ్రాయెల్ బాంబు దాడులతో ఇప్పటివరకూ గాజా సిటీ లోని 1,324 బిల్డింగులు (రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్​ హ్యూమనిటేరియన్ అఫైర్స్(ఓచా)’ శనివారం వెల్లడించింది. మొత్తం 5,540 భవనాలు ధ్వంసం అయ్యాయని తెలిపింది. వీటిలో 3,743 ఇండ్లు నివాసానికి ఏమాత్రం పనికిరాకుండా పోయాయని, రిపేర్ చేసేందుకు వీలులేనంతగా డ్యామేజ్ అయ్యాయని పేర్కొంది. మరో 55 వేల ఇండ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయని.. గాజా పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రీ అందించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు తెలిశాయని వెల్లడించింది. 

గాజా స్ట్రిప్​లో గురువారం నాటికే మొత్తం 4.23 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని పేర్కొంది. ఉత్తర గాజాలో సుమారు 11 లక్షల మంది ప్రజలు ఉన్నారని, ఇజ్రాయెల్ హెచ్చరికల తర్వాత శుక్రవారం నాటికి వేలాది మంది దక్షిణ గాజాకు పారిపోయారని ఓచా వివరించింది. గాజాలో చాలా మంది ఇప్పుడు తాగునీళ్లు కూడా లేక అవస్థలు పడుతున్నారని, బావుల్లోని మురికినీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పింది. కరెంట్ సప్లై లేకపోవడంతో వాటర్ సప్లైకి, హాస్పిటల్స్ నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతోందని చెప్పింది. కాగా, హమాస్​ను అంతంచేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. గ్రౌండ్ అటాక్​కు రంగం సిద్ధం కావడంపై స్పందిస్తూ.. శత్రువులు మూల్యం చెల్లించుకోవడం మొదలైందని, ఇదింకా ప్రారంభమేనని ఆయన హెచ్చరించారు.   

గాజాలో 2,215 మంది మృతి 

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 2,215కు పెరిగిందని, వీరిలో 724 మంది పిల్లలు ఉన్నారని పాలస్తీనియన్ హెల్త్ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. మొత్తం 8,714 మంది గాయపడ్డారని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో మరో 9 మంది బందీలు చనిపోయారని హమాస్ వెల్లడించింది. హమాస్ చెరలో 150 మంది బందీలు ఉండగా, ఇప్పటివరకూ 22 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. ఇజ్రాయెల్​లో 1,300 మంది చనిపోయారని ఐడీఎఫ్ ప్రకటించింది.  

రఫా క్రాసింగ్ వద్ద బార్డర్ ఓపెన్ 

గాజాలోని అమెరికన్ పౌరులు రఫా క్రాసింగ్ గుండా గాజా స్ట్రిప్ నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య శనివారం ఒప్పందం కుదిరింది. మధ్యాహ్నం 12 నుంచి 5 వరకూ ఈ బార్డర్​ తెరిచేందుకు అంగీకరించాయి. నార్త్ గాజా నుంచి సౌత్ గాజాకు వెళ్లేందుకు వీలుగా ఉదయం 10 నుంచి 4 దాకా  రెండు మెయిన్ రూట్లలో దాడులు చేయబోమని ఇజ్రాయెల్ శనివారం ప్రకటించింది.

హమాస్ టాప్ కమాండర్ హతం.. 

హమాస్ గ్రూప్ ఏరియల్ ఆపరేషన్స్​కు అధిపతిగా ఉన్న టాప్ కమాండర్ మురద్ అబూ మురద్​ను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. హమాస్ ఆపరేషన్ సెంటర్ పై తమ ఫైటర్ జెట్​లు చేసిన దాడుల్లో అతడు చనిపోయాడని వెల్లడించింది. మరోవైపు, హమాస్​కు మద్దతుగా ఉత్తరాది న లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పైకి హిజ్బొల్లా గ్రూపు దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయె ల్​లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు హిజ్బొల్లా టెర్రరిస్టులను హత మార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడులతో అమాయక పాలస్తీనా ప్రజలు చనిపోతున్నారని, ఈ దాడులను వెంటనే ఆపాలంటూ బీరట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్, బహ్రెయిన్ వంటి అరబ్ కంట్రీస్​లో, లండన్, తదితర దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.

హమాస్​ ఆల్​ కాయిదా లాంటిదే: బైడెన్​

వాషింగ్టన్: ఇజ్రాయెల్​లో హమాస్ జరిపిన దురాగతాలు బయటపడుతున్న కొద్దీ ఆల్​కాయిదా కంటే కూడా క్రూరులని తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ‘హమాస్ దాడిలో 27 మంది అమెరికన్లు సహా మొత్తం 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లను చూస్తుంటే ఆల్​కాయిదా టెర్రరిస్టులే కొంత బెటర్ అనేలా ఉంది. ఈ పోరులో ఇజ్రాయెల్ వైపే అమెరికా నిలబడుతుంది’ అని బైడెన్ స్పష్టం చేశారు.

వాళ్లు నరరూప రాక్షసులు: జార్జ్​ బుష్​

వాషింగ్టన్: హమాస్​ మిలిటెంట్లు కోల్డ్​ బ్లడెడ్​ కిల్లర్స్​అని, వారిని ఏరిపారేసేందుకు నెతన్యాహు వ్యవహరిస్తున్న తీరు కరెక్టేనని అమెరికా మాజీ అధ్యక్షుడు  జార్జ్​ బుష్ ​తెలిపారు. ‘‘మీరు (ఇజ్రాయెల్ వాసులు) నరరూప రాక్ష్తసులతో పోరాడు తున్నారు. మీపై జరుగుతున్నది ప్రేరేపిత దాడి. వారి లక్ష్యాన్ని సాధించడానికి అమాయకులను చంపడానికీ వెనుకాడట్లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్​కు అండగా ఉండాలె.. ఉంటుందనే నా నమ్మకం’’ అని ​పేర్కొన్నారు.