ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల రాకెట్ల దాడి.. ఏమిటీ హమాస్..?

ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ల రాకెట్ల దాడి..  ఏమిటీ హమాస్..?


హమాస్ మిలిటెంట్ల రాకెట్ దాడులతో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి భీకర యుద్ధం మొదలైంది. హమాస్ రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంతో పాటు దేశమంతటా ప్రజలను అలర్ట్ చేస్తూ సైరన్లు మోగించారు. గాజా స్ట్రిప్​కు దగ్గరగా ఉన్న ప్రజలంతా ఇండ్లలోనే ఉండిపోవాలని, మిగతా ప్రాంతాల్లోని వారు బాంబు షెల్టర్లకు సమీపంలోనే ఉండాలని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్​ల తరహాలో పికప్ ట్రక్కులలో, మోటార్ బైక్​లపై ఇజ్రాయెల్​లోని దక్షిణాది టౌన్​లలోకి మిలిటెంట్లు ప్రవేశించారు. పారాచూట్లతో సైతం ఇజ్రాయెల్ భూభాగంలోకి దిగారు. అటు సముద్రం నుంచి పడవల్లో సైతం సాయుధ మిలిటెంట్లు దూసుకొచ్చారు. దాదాపుగా ఇజ్రాయెల్​పై ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లుగా మిలిటెంట్లు ఆ దేశ పట్టణాల్లోకి ప్రవేశించి జనంపైకి, బలగాలపైకి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. హమాస్ రాకెట్ దాడులు జరిగిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులు ప్రారంభించింది. 

హమాస్​పై యుద్ధమే..!

వేలాది రాకెట్ దాడులు చేయడంతోపాటు తమ భూభాగంలోకి పెద్ద ఎత్తున మిలిటెంట్లను పంపిన హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్​పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యుద్ధాన్ని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ ప్రజలారా.. మనం యుద్ధంలో ఉన్నాం. మిలిటరీ ఆపరేషన్ కాదు. యుద్ధం చేస్తున్నాం. ఇందులో మనం గెలుస్తాం. హమాస్ గతంలో ఎన్నడూ చూడనంతటి స్థాయిలో మూల్యం చెల్లించుకుంటుంది” అని ఆయన హెచ్చరించారు. దేశంలోకి మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఆయుధాలతో చొరబడ్డారని ఇజ్రాయెల్ నేషనల్ రెస్క్యూ సర్వీస్ వెల్లడించింది. కనీసం 21 చోట్ల స్పెషల్ ఫోర్సెస్ పోరాడుతున్నాయని, దక్షిణ ఇజ్రాయెల్​ను మొత్తం సీల్ చేశామని ఇజ్రాయెల్ పోలీస్ చీఫ్ యాకోవ్ షబ్తాయి చెప్పారు. ఇజ్రాయెల్​పై యుద్ధాన్ని ప్రారంభించి హమాస్ ఘోరమైన తప్పిదం చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు. 

ఏమిటీ హమాస్?

జెరూసలెం: మిలిటరీ సామర్థ్యాలు ఉన్న పొలిటికల్ గ్రూప్ ‘హమాస్ (హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామి యా)’. దీన్ని 1987 డిసెంబర్‌‌‌‌లో పాలస్తీనియన్ క్లరిక్ షేక్ అహ్మద్ యాసిన్ ఏర్పాటు చేశారు. ఇదొక మిలిటెంట్ ఉద్యమం. గాజా స్ట్రిప్‌‌లోని 2 మిలియన్ల కు పైగా ప్రజలను పాలిస్తున్నది. ఇజ్రాయెల్‌‌పై సాయుధ తిరుగుబాటు చేస్తుంటుంది. హమాస్‌‌లో వివిధ రాజకీయ, సైనిక, సోషల్ విధులు నిర్వర్తించే నాయకత్వ సంస్థలు ఉన్నాయి. వీటిలో కొన్ని స్థానికంగా, మరికొన్ని అజ్ఞాతంలోఉంటూ పని చేస్తాయి. 1988లో హమాస్ తన చార్టర్‌‌ను ప్రచురించింది. ఇజ్రాయెల్‌‌ను నాశనం చేయాలని, చరిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. ఓస్లో ఒప్పందాలపై పీఎల్‌‌వో లీడర్ యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ పీఎం ఇజాక్ రాబిన్ సంతకాలు చేయడానికి 5 నెలల ముందు.. 1993 ఏప్రిల్​లో హమాస్ మొదటిసారిగా సూసైడ్​ బాంబు దాడి చేసింది. దీనిని డజనుకు పైగా దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. హమాస్‌‌ కు ఇరాన్, తుర్కియే వంటి దేశాలు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్నాయి.