గాజాలో ఇజ్రాయెల్ ‘నరమేధం’! ..పాలస్తీనియన్ల అంతమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నయ్

గాజాలో ఇజ్రాయెల్ ‘నరమేధం’! ..పాలస్తీనియన్ల అంతమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నయ్
  • నెతన్యాహు, హెర్జోగ్, గాలంట్​లే ఇందుకు బాధ్యులు 
  • యూఎన్ ‘కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ’ నివేదిక 

స్విట్జర్లాండ్: గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ(సీవోఐ) వెల్లడించింది. పాలస్తీనా ప్రజలను మొత్తం అంతం చేయాలన్న లక్ష్యంతోనే ఈ నరమేధం కొనసాగుతోందని పేర్కొంటూ ఒక నివేదికను విడుదల చేసింది. గాజాలో ఈ నరమేధానికి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇజాక్ హెర్జోగ్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ లే కారణమని, వీరిని శిక్షించడంలో ఆ దేశ అధికారులు ఫెయిల్ అయ్యారని నివేదిక పేర్కొంది.

 దీనిపై సీవోఐ చీఫ్, సౌత్ ఆఫ్రికన్ మాజీ జడ్జి నవీ పిల్లే మంగళవారం ‘ఏఎఫ్ పీ’ వార్తా సంస్థతో మాట్లాడారు. ఈ మారణహోమానికి పూర్తిగా ఇజ్రాయెల్ దేశానిదే బాధ్యత అని అన్నారు. పాలస్తీనాలో ప్రజల హక్కుల పరిస్థితిపై సీవోఐ ఇన్వెస్టిగేటర్లు దర్యాప్తు చేసి, ఈ నివేదికను రూపొందించినట్టు ఆయన తెలిపారు. 

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ టెర్రరిస్ట్ ల దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించిందని, ఇప్పటివరకూ గాజాలో 65 వేల మంది చనిపోయారని పేర్కొన్నారు. జీనోసైడ్ కన్వెన్షన్ 1948లో పేర్కొన్న ఐదు రకాల నరమేధాలకూ ఇజ్రాయెల్ పాల్పడిందన్నారు. ఈ మారణహోమాలకు సంబంధించిన ఆధారాలను తాము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రాసిక్యూటర్ కు అందించామని తెలిపారు. 

కాగా, సీవోఐ నివేదికకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి తరఫున అధికారికంగా విధులు నిర్వహించదు. కేవలం దౌత్యపరమైన ఒత్తిడిని పెంచేందుకు, కోర్టులకు ఆధారాలు సమర్పించేందుకు మాత్రమే ఈ సంస్థ నివేదికలు ఉపయోగపడతాయి.