గాజాను.. విడిచివెళ్లండి

గాజాను.. విడిచివెళ్లండి
  •     పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక 
  •     హమాస్ టెర్రరిస్టులకు దూరంగా ఉండాలంటూ వార్నింగ్ 
  •     ప్రజలు ఎక్కడికీ వెళ్లొద్దని.. ఇండ్లలోనే ఉండాలంటూ హమాస్ పిలుపు 
  •     ప్రాణభయంతో సిటీ వదిలి వెళ్తున్న జనం 
  •     గాజాలోకి వెళ్లి ఇజ్రాయెల్​బలగాల దాడులు
  •     ఉత్తరం నుంచి దక్షిణ వైపు వెళ్లాలని సూచన
  •     హమాస్ టెర్రరిస్టులకు దూరంగా ఉండాలంటూ వార్నింగ్ 
  •     వెళ్లొద్దని హమాస్ పిలుపు 
  •     ప్రాణభయంతో మూటాముల్లె సర్దుకునిపోతున్న గాజా ప్రజలు

జెరూసలెం : హమాస్ మిలిటెంట్లు చేసిన దాడికి ప్రతీకారంగా వారం రోజులుగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. గాజాలోకి చొచ్చుకెళ్లి.. మిలిటెంట్లను ఏరివేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పాలస్తీనా ప్రజలు, యూఎన్ అధికారులు గాజా సిటీని 24 గంటల్లోగా ఖాళీ చేయాలని, గాజా స్ట్రిప్ లోని దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని సూచించింది.

‘‘గాజా ప్రజలారా.. మీ భద్రత కోసం దక్షిణం వైపు వెళ్లండి. మిమ్మల్ని కవచాలుగా వాడుకుంటున్న హమాస్ టెర్రరిస్టులకు దూరంగా ఉండండి. రానున్న రోజుల్లో గాజా సిటీలో దాడులు చేయడాన్ని ఐడీఎఫ్ కొనసాగిస్తుంది. సివిలియన్లకు ఎలాంటి హానీ జరగకూడదని కోరుకుంటున్నది” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రజలు తమ మూటాముల్లె సర్దుకొని వెళ్లిపోతున్నారు. కార్లలో అవసరమైన లగేజీని పెట్టుకుని ఎంతో మంది వెళ్లిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మిలిటెంట్లను ఏరిపారేయాలని..

గాజాకు దక్షిణం వైపు ఈజిప్టు ఉండగా.. ఉత్తరం, తూర్పు వైపు ఇజ్రాయెల్ ఉంది. మొత్తం అన్నివైపుల నుంచి గాజాను ఇజ్రాయెల్‌‌‌‌ నిర్బంధించింది. అన్ని సరఫరాలను నిలిపేసింది. హమాస్ మిలిటెంట్లు సివిలియన్ ఏరియాస్‌‌‌‌ నుంచే.. ప్రజలను అడ్డుగా పెట్టుకుని దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రజలను అక్కడి నుంచి తరలిస్తే.. మిలిటెంట్లను ఏరిపారేయవచ్చని భావిస్తున్నది. యుద్ధం ముగిసిన తర్వాత ప్రజలు తిరిగి రావడానికి పర్మిషన్ ఇస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ స్పష్టంచేసింది. కాగా, ఇజ్రాయెల్ ప్రకటనపై హమాస్ మండిపడింది. ఇది ఇజ్రాయెల్ పన్నాగమని, ప్రజలందరూ తమ ఇండ్లలోనే ఉండాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ హెచ్చరికలు అంతర్జాతీయ చట్టం, నాలుగో జనీవా కన్వెన్షన్‌‌‌‌ కు వ్యతిరేకమని పేర్కొంది. 

గాజాలోకి వెళ్లి ఇజ్రాయెల్ బలగాల దాడులు 

ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు గాజా సరిహద్దు వైపు దూసుకుపోతున్నాయి. ట్యాంకులు, ఆయుధాలతో కూడిన వాహనాలు ఫెన్సింగ్ వద్ద ఆగాయి. అయితే గాజాలోకి చొచ్చుకెళ్లి దాడులు చేసే అంశంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ బలగాలు గత 24 గంటల్లో గాజాలోని పలు ప్రాంతాల్లోకి వెళ్లి దాడులు చేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం ప్రకటించింది. ప్రధానంగా బందీలను దాచిన ప్రాంతాలను గుర్తించేందుకు ఈ దాడులు చేసినట్లు తెలిపింది.

4 వేలు దాటిన మృతుల సంఖ్య  

యుద్ధంలో ఇప్పటిదాకా రెండువైపులా 4,330 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో 1530 మంది.. హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 1300 మంది మరణించారు. తమ దేశంలో 1500 మంది హమాస్ మిలిటెంట్ల డెడ్ బాడీలను గుర్తించామని ఇజ్రాయెల్ ఇదివరకే ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటికి ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 4 వేలు దాటింది.

ఐడీఎఫ్ డేరింగ్ ఆపరేషన్

గాజా సెక్యూరిటీ ఫెన్సింగ్ వద్ద హమాస్ మిలిటెంట్ల బందీలో ఉన్న 250 మందిని ఐడీఎఫ్ ఎలైట్ యూనిట్ రక్షించింది. 60 మందికిపైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చింది. మరో 26 మందిని అదుపులోకి తీసుకుంది. సూఫా ఔట్‌‌‌‌పోస్టు వద్ద చేసిన ఈ ఆపరేషన్‌‌‌‌  వీడియోను సోషల్‌‌‌‌ మీడియాలో ఆర్మీ షేర్ చేసింది. హమాస్ డిప్యూటీ కమాండర్ ముహమ్మద్ అబు అలీని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పింది. ఓ బిల్డింగ్‌‌‌‌లోకి సైనికులు వెళ్లడం, బుల్లెట్ల వర్షం కురిపించడం, గ్రనేడ్లు విసరడం.. వంటివి ఆ వీడియోలో కనిపించాయి.

అమ్మా.. మనం ఇజ్రాయెల్​లో ఎందుకు పుట్టాం?

ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాలస్తీనా పరిస్థితి దారుణంగా తయారైంది. గాజాలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్​లో మ్యాథ్స్ టీచర్​గా పని చేస్తున్న 37 ఏండ్ల సుజన్ బర్జాక్.. రిమాల్​లోని ముస్తఫా హాఫ్ట్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్నది. ఇజ్రాయెల్ వరుస దాడులతో తన పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఆమె నిశ్చేష్టురాలవుతోంది.‘‘మనం ఇక్కడ ఎందుకు పుట్టాం? ఇజ్రాయెల్ వాళ్లు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మనం రాత్రికి రాత్రే చనిపోతామా? బిల్డింగ్ కూలి మీద పడితే ఏంచేయాలి? ఎవరైనా కాపాడుతారా? నీకు, నాన్నకు ఏమైనా అయితే నేను ఎక్కడ బతకాలి?” అంటూ తన పిల్లాడు ప్రశ్నించినట్లు చెప్తూ సుజన్ కన్నీటిపర్యంతం అవుతోంది. 

పొట్టచీల్చి.. బిడ్డను బయటికి తీసి చంపేశారు

ఇజ్రాయెల్​లో హమాస్ టెర్రరిస్ట్​ల రాక్షస కృత్యాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. అమాయకులపై మెషిన్ గన్స్​తో కాల్పులు జరిపారు. మహిళలు, చిన్న పిల్లల తలలు నరికేశారు. పాయింట్ బ్లాంక్​లో కాల్చేశారు. తాజాగా మరో ఘటన హమాస్ టెర్రరిస్టుల రాక్షసత్వాన్ని బయటపెట్టింది. కడుపుతో ఉన్న మహిళ పొట్టను చీల్చి.. శిశువును బయటికి తీసి.. పొడిచి చంపేశారు. వినడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన.. గాజా నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న బిరి ఏరియాలో జరిగింది. బొడ్డు తాడు కూడా తెగని శిశువు, పక్కనే తల్లి డెడ్​బాడీని చూసి షాక్ అయ్యామని ఇజ్రాయెల్ రెస్క్యూ టీం వెల్లడించింది.