
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చన్న పరిస్థితులు తలెత్తాయి. శనివారం (అక్టోబర్ 7న) ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది.
పాలస్తీనా చర్యను ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగా హెచ్చరించారు. తాము యుద్ధం చేస్తున్నామని, ఆపరేషన్ కాదని స్పష్టం చేశారు. తమ శత్రుదేశం గతంలో ఎన్నడూ లేని విధంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ దేశ పౌరులందరూ ఇళ్లల్లోనే ఉండాలని, ఎవరూ బయటకు రావవొద్దని సూచించారు.
హమాస్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ‘ఐరన్ స్వార్డ్స్’ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే గాజాలోని ఓ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా ఆరోపించింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లు చెబుతోంది.
కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ముఠాలు కూడా చేరినట్లు తెలుస్తోంది.
1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.