- శత్రువుల తప్పుడు ప్రచారం..నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి
జెరూసలెం: ఇరాన్ దాడుల్లో తాను చనిపోయానని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరో కొత్త వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అంతకుముందు ఒక కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియో విడుదల చేయగా.. అది డీప్‌ఫేక్ వీడియో అంటూ ఆరోపణలు రావడంతో నెతన్యాహు నేరుగా ప్రజల ముందుకు వచ్చి తాను క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో శత్రువుల తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఏఐ ఆరోపణలపై వ్యంగ్య స్పందన..
తొలుత విడుదల చేసిన వీడియోలో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని, అది ఏఐ సృష్టించిన డీప్‌ఫేక్ అని ఎలన్ మస్క్‌కు చెందిన 'గ్రోక్ ఏఐ' పేర్కొంది. దీనిపై తాజా వీడియోలో నెతన్యాహు అత్యంత చాకచక్యంగా స్పందించారు. ఆయన తన రెండు చేతులను కెమెరా వైపు స్పష్టంగా చూపిస్తూ, తన వేళ్లను కావాలంటే లెక్కపెట్టుకోవచ్చని విమర్శకులకు సవాల్ విసిరారు.
ఈ చర్య ద్వారా తన రక్షణ, ఆరోగ్యంపై వస్తున్న సాంకేతిక సందేహాలన్నింటినీ ఆయన పటాపంచలు చేశారు. కాగా, ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సైనిక యుద్ధంతో పాటూ తీవ్రమైన 'సమాచార యుద్ధం' నడుస్తోంది. ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడుతున్నారని ఇరుపక్షాలు ఆరోపించుకుంటున్నాయి. నెతన్యాహు కార్యాలయం పదేపదే ఇలాంటి వీడియోలను విడుదల చేయడం ద్వారా, ప్రభుత్వం స్థిరంగా ఉందని, నాయకత్వం సురక్షితంగా ఉందన్న భరోసాను తన దేశ ప్రజలకు కల్పిస్తోంది.
