
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో శనివారం నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ45 రిహార్సల్ విజయవంతమైంది. బ్రహ్మ ప్రకాష్ హాలులో మధ్యాహ్నం రాకెట్ సన్నద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్) జరిగింది. ఇందులో రాకెట్ ప్రయోగంపై శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా చర్చించారు. వాహక నౌక అనుసంధానం, ఉపగ్రహాల అమరిక, రిహార్సల్ తదితర దశలపై శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ-సీ45 ప్రయోగం సోమవారం ఉదయం 9.27 గంటలకు జరిగేలా అధికారికంగా ప్రకటించారు. షార్ సంచాలకులు ఎస్. పాండ్యన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్) సమావేశం రాత్రి వరకు జరిగింది.
ఇందులో ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమయ్యింది. ఇది 28 గంటలపాటు కొనసాగిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్ తో పాటు, విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు కక్ష్యల్లో వాటిని ప్రవేశపెట్టనుంది. ఇమిశాట్ కు DRDO సైంటిస్టులు రూపకల్పన చేశారు. ఇది రక్షణ శాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యూఎస్‌ఏలకు చెందిన 28 ఉపగ్రహాలు ఉన్నాయి.