ఇక నుంచి ఇస్రో రాకెట్లు తయారు చేయదు.. అంతా ప్రైవేటు చేతికే!

ఇక నుంచి ఇస్రో రాకెట్లు తయారు చేయదు.. అంతా ప్రైవేటు చేతికే!

భారత అంతరిక్ష పరిశోధనలో ఎన్నో మైలురాళ్లు, ఎన్నో ఆవిష్కరణలు, ఎంతో చరిత్ర లిఖించిన ఇస్రో బాధ్యతలు తగ్గిపోతున్నాయా..?  శాటిలైట్లు, శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ తయారు చేసే అంతరిక్ష ప్రయోగ దిగ్గజం ఇప్పుడు ఆ పనిని పక్కన పెడుతోందా.? ఇండియా స్పేస్ చైర్మ డా.పవన్ గోయెంకా వ్యాఖ్యలతో అవుననే సమాధానం వస్తోంది. 

ఇస్రో శాటిలైట్స్, శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ తయారీ నుంచి తప్పుకోనున్నట్లు చైర్మన్ పవన్ గోయెంకా తెలిపారు. బిజినెస్ టుడే 100వ ఎకానమీ సమిట్ లో మాట్లాడిన గోయెంకా.. ఇస్రో ట్రాన్సిషన్ గురించి చెప్పారు. ఇస్రోలో ఆల్ రెడీ మార్పు మొదలైందని.. శాటిలైట్స్, శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ తయారీ నుంచి తప్పుకుని.. కేవలం పరిశోధన మీదనే దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. రీసెర్చ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సైంటిఫిక్ మిషన్స్, ప్రైవేట్ కంపెనీలకు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తయారీ మొదలైన వాటిపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. 

ఇస్రో లాంచ్ వెహికిల్ తయారు చేయదు. ఇతర ప్రభుత్వ సంస్థలు లేదా ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు ఆ పని చూసుకుంటాయని తెలిపారు. ఇప్పటికే చిన్న శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ (SSLV) తయారీ బాధ్యతలను హిందుస్తాన్ ఏరోనాటిక్ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. 

నెక్స్ట్ ఫేజ్ మరింత కీలకంగా ఉండవచ్చునని ఆయన అన్నారు.  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) , భారతదేశపు అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) కూడా ప్రైవేటీకరణ దిశగా పయనిస్తున్నట్లు గోయెంకా తెలిపారు. SSLV  తయారీ ప్రక్రియ మాదిరిగా..  భవిష్యత్తులో  జరిగే ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ లో ప్రభుత్వ రంగ సంస్థలకు పాల్గొనే అవకాశం ఉండదన్నారు. దీనివల్ల ప్రైవేట్ పరిశ్రమలే దీని బాధ్యతను చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. 

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గా ఇస్రో కొనసాగుతుందని.. మ్యానిఫ్యాక్చరింగ్ బాధ్యలు ఇక నుంచి తీసుకోవదని ఆయన తెలిపారు. ఇప్పటికే 120 టెక్నాలజీలను ప్రైవేట్ సెక్టార్ కు ట్రాన్స్ ఫర్ చేసినట్లు చెప్పారు. న్యూ లాంచ్ సెంటర్ ను కూడా ప్రైవేట్ సెక్టార్ కు అప్పగించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. వచ్చే నాలుగైదు నెలలో అది పూర్తవుతుందన్నారు. 

ALSO READ : రూ.75 లక్షలు ఇస్తున్న పాత కంపెనీలోనే ఉండాలా.. 

ఇస్రో టెక్నాలజీని ప్రైవేట్ కు ట్రాన్స్ ఫర్ చేయడం, తయారీ బాధ్యతలను తప్పుకుని ప్రైవేటుకు అప్పగించడం వంటి నిర్ణయాలపై ఇప్పటికే భిన్నవాదనలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో సమర్ధవంతంగా, ఎన్నో మిషన్లను విజయంతం చేసి.. ఎన్నో శాటిలైట్లను తయారుచేసిన ఇస్రోనే నిర్వీర్యం చేసి ప్రైవేటు గుత్తాధిపత్యాన్ని పెంచిపోషించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. లేటెస్టుగా గోయెంకా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.