మళ్లీ మెట్రోపార్కింగ్​ లొల్లి

మళ్లీ మెట్రోపార్కింగ్​ లొల్లి
  • నాగోల్, మియాపూర్​లలో 15 నుంచి అమలు అంటూ బోర్డులు 
  • నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్న ప్రయాణికులు 
  • ఆదివారం రెండు స్టేషన్ల వద్ద  ఆందోళనకు పిలుపు  
  • అధికారిక నిర్ణయం తీసుకోలేదంటున్న  ఎల్అండ్​టీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాగోల్, మియాపూర్​ మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్​పార్కింగ్​ అంశం గందరగోళానికి దారి తీస్తోంది. ఈ నెల 15నుంచి రెండు స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేయబోతున్నట్టు పార్కింగ్​ఏరియాలో బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆదివారం నాగోల్, మియాపూర్​మెట్రో స్టేషన్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. 

ఎల్అండ్ టీ  అధికారులు మాత్రం పెయిడ్ ​పార్కింగ్ అంశం ఫైనల్ ​కాలేదని, పెయిడ్ ​చార్జీల బోర్డు వెండర్ ఏర్పాటు చేసి ఉండొచ్చంటున్నారు. ఓ వైపు బోర్డులు పెట్టి మరోవైపు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పడంపై అనుమానాలున్నాయని, స్పష్టమైన ప్రకటన ప్రయాణికులు కోరుతున్నారు. 
 

గతంలో వెనక్కి తగ్గిన ఎల్అండ్​టీ

గత నెల ఆగస్టు 25 నుంచి నాగోల్​ మెట్రోస్టేషన్​లో, సెప్టెంబర్​1 నుంచి మియాపూర్​ మెట్రో స్టేషన్ లో పెయిడ్ ​పార్కింగ్​ విధానాన్ని తీసుకువస్తున్నామని ఎల్అండ్​టీ ప్రకటించింది. నాగోల్ ​స్టేషన్​లో ఆగస్టు14న పైలట్​రన్ ​కూడా నిర్వహించింది. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాగా ఆగస్టు 24న ​నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత  సెప్టెంబర్​1 నుంచి పెయిడ్​ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. కానీ, సెప్టెంబర్ 15కు పొడిగించడమే కాకుండా నాగోల్​, మియాపూర్ ​మెట్రో స్టేషన్లలో బోర్డులు ఏర్పాటు చేసింది.  

రోజు ఐదు వేల వాహనాల పార్కింగ్​

మియాపూర్, నాగోల్​ మెట్రోస్టేషన్లు చివరి స్టేషన్లు కావడంతో వేల మంది ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. వెళ్లే ముందు తమ వాహనాలను ఈ స్టేషన్ల పార్కింగ్ ​స్థలాల్లో నిలుపుతారు. ఇప్పటివరకు ఇక్కడ పార్కింగ్ ​ఫీజు లేదు. దీంతో నాగోల్ ​పార్కింగ్​లో రోజూ 5 వేల టూ వీలర్స్, వందకు పైగా ఫోర్ ​వీలర్స్ ​పార్క్​చేస్తున్నారు. 

నెల క్రితం ఎల్అండ్​టీ నాగోల్​లో పార్కింగ్​ ఫీజు వసూలు చేయబోతున్నామనే ప్రకటన చేసింది.  బైక్​కు నెలకు రూ. వెయ్యి...కారుకు రూ.3 వేలు ఎవరైనా ఉద్యోగి నాగోల్, మియాపూర్​లలో టూ వీలర్​ పార్క్​ చేస్తే నెలకు ఎంత లేదన్నా రూ. వెయ్యికి పైగానే చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫోర్​వీలర్​అయితే రూ. 3 వేల వరకూ అవుతుంది.

 ఆఫీసులకు వెళ్లేవారు కనీసం ఎనిమిది గంటలు పని చేసినా, రాను పోను జర్నీ గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన 12 గంటల్లోపు పార్కింగ్​ ఫీజు చెల్లించాల్సిందే. ఇప్పటికే మెట్రో అధిక చార్జీలు తీసుకుంటోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ పార్కింగ్ ​ఫీజు అంటే తమ వల్ల కాదని నాగోల్, మియాపూర్​ స్టేషన్ల నుంచి వెళ్లే వారు తేల్చి చెబుతున్నారు.  

హెచ్ఎంఆర్ కంటే..ఎల్అండ్​టీ చార్జీలే ఎక్కువ  

సిటీలో మెట్రో మూడు కారిడార్లలో 59 స్టేషన్లుండగా దాదాపు 40 స్టేషన్లలో పార్కింగ్​ ఫీజు తీసుకుంటున్నారు. కొన్ని స్టేషన్లలో హెచ్​ఎంఆర్ఎల్​ పార్కింగ్​నిర్వహిస్తుండగా..మియాపూర్, నాగోల్, బాలానగర్​తో పాటు ఇంకా కొన్ని స్టేషన్లలో పార్కింగ్​ను ఎల్అండ్​టీ చూసుకుంటోంది. అయితే హెచ్ఎంఆర్ఎల్​ ఇప్పటికే వసూలు చేస్తున్న పార్కింగ్​ ఫీజులకు, ఇప్పుడు ఎల్అండ్​టీ నాగోల్, మియాపూర్​ ​మెట్రోస్టేషన్​లో తీసుకోబోయే పార్కింగ్ ​ఫీజులకు తేడా ఉందంటున్నారు.  

గంటల విషయంలోనూ వ్యత్యాసం ఉందని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటున్నారు. దీనిపై కోనేరి వెంకటేశ్​ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ తాను ఉద్యోగరీత్యా నాలుగేండ్లుగా నాగోల్ ​నుంచి హైటెక్​ సిటీ వెళ్తున్నానని, పార్కింగ్​ ఫీజు లేకపోవడం వల్ల నెలకు రూ. 2 వేల వరకూ మిగులుతోందన్నాడు. కొత్తగా చార్జీ పెడితే తనకు అదనపు భారమే అవుతుందన్నాడు.  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ కోరాడు.    

టూ వీలర్ (హెచ్ఎంఆర్ఎల్​)        టూ వీలర్​ (ఎల్అండ్​టీ బోర్డులో) 
కనీసం 2 గంటలకు           రూ.10        కనీసం 2 గంటలు     రూ. 10
2–3 గంటలు          రూ. 15        8 గంటలు వరకు       రూ. 25
3–4 గంటలు          రూ. 20        12 గంటల వరకు      రూ. 40
4–12 గంటలు          రూ. 25        12 గంటలు దాటితే     ప్రతి గంటకు 5 
12 గంటల దాటితే  ప్రతి గంటకు రూ. 5 
 
ఫోర్​ వీలర్​  (హెచ్​ఎంఆర్​ఎల్)​         ఫోర్​వీలర్​ (ఎల్​ అండ్​టీ బోర్డులో)  
0–2 గంటలు     రూ. 30        0–2 గంటలు     రూ. 30
2–3 గంటలు    రూ. 45        8 గంటల వరకు     రూ.75
3–4 గంటలు    రూ. 60        12 గంటల వరకు     రూ. 120 
4–12 గంటలు     రూ. 75        12 గంటలు దాటితే    గంటకు రూ. 15  
12 గంటలు దాటితే ప్రతి గంటకు రూ. 15  

ఆదివారం ఆందోళన 

పెయిడ్ పార్కింగ్ విషయంలో ఎల్అండ్ టీ గందరగోళానికి గురి చేస్తోంది. ఆదివారం ప్రయాణికులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్, మియాపూర్  స్టేషన్ల వద్ద ఆందోళన నిర్వహిస్తాం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. 

 – కేఎస్.ప్రదీప్, ప్రెసిడెంట్,   ప్రొగ్రెసివ్​యూత్​ లీగ్​